Nov 27,2022 00:24

మాట్లాడుతున్న రైతు సంఘం నాయకులు కర్రి అప్పారావు

ప్రజాశక్తి-అనకాపల్లి
రైతులు పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధర చట్టం తేవాలని అఖిలపక్ష రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. స్థానిక దొడ్డి రామనాయుడు కార్మిక కర్షక నిలయంలో శనివారం అఖిలపక్ష రైతు సంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పంటల గిట్టుబాటు ధర చట్టం, విద్యుత్‌ ప్రైవేటీకరణ బిల్లు రద్దుపై మోడీ హామీ ఇచ్చి ఏడాదైనా నేటికీ దానిని అమలు చేయలేదన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా అన్ని గవర్నర్‌ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ఏఐకేసి పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఢిల్లీలో రైతుల పోరాటంతో దిగొచ్చిన మోడీ సర్కారు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని గుర్తు చేశారు. విద్యుత్‌ బిల్లు రైతు సంఘాలతో చర్చించిన తర్వాతే పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పి నేడు దొడ్డిదారిన సెలెక్ట్‌ కమిటీకి పంపడం దారుణమన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని విమర్శించారు. వ్యవసాయ రంగ పరిరక్షణే ధ్యేయంగా దేశవ్యాప్తంగా రెండో దశ పోరాటానికి కార్యా చరణ రూపొందించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కర్రి అప్పారావు (ఎపి రైతు సంఘం), ఎ.బాలకృష్ణ (కౌలు రైతు సంఘం), ఆర్‌.శంకరరావు (సిఐటియు), బి.ఉమామహేశ్వరరావు (వార్వా), బుద్ధ రంగారావు (నిర్వాసితుల సంఘం) బి.నూక అప్పారావు (ఎన్‌పిఆర్‌డి), కె.శంకర్రావు (రైతు సంఘం), ఆర్డీఎస్‌.అప్పారావు, యు.సూర్యనారాయణ (గోపాలమిత్ర సంఘం) తదితరులు పాల్గొన్నారు.