పంటల బీమాను 'ప్రయివేట్'కు అప్పగించొద్దు- ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిఒ 660 కాపీలు దగ్ధం
కడప అర్బన్ : 2023-24 పంటల బీమాను ప్రయివేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించవద్దని, రాష్ట్ర ప్రభుత్వమే తన బాధ్యతగా పంటల బీమా పథకాన్ని నిర్వహించాలని ఎపి రైతుసంఘం, సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. శనివారం పాత బస్టాండ్ ఆవరణంలో జిఒ 660 కాపీలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శలు బి. దస్తగిరి రెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ పంటల బీమా పై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ 660ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంటల బీమాలో ప్రయివేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రవేశం నిలిపివేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా అమలు చేయాలని కోరారు. 2023-24 ఖరీఫ్ సీజన్‌లో పంటల బీమా అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలతో బిడ్డింగ్ నిర్వహించిందని చెప్పారు. పంటల బీమా విధానం రైతులకు నష్టం చేసేది గాను, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రయోజనాల కొరకు ఉపయోగపడేదిగా ఉంద న్నారు. పంటల బీమాలో ఇన్సూరెన్స్ కంపెనీల ప్రమేయం లేకుండా ప్రభు త్వమే పంటల బీమా పథకం అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వత్తిడికి లొంగి పంటల బీమా పథకంలో ఇన్సూరెన్స్ కంపెనీలను అనుమ తించవద్దన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా పాలసీ ఇన్సూరెన్స్ కంపెనీల లాభాల కొరకే తప్ప రైతుల ప్రయోజనం కొరకు కాదని విమర్శించారు. సమగ్ర పంటల బీమా పథకం తీసుకువచ్చి అన్ని పంటలకు పంటల బీమా వర్తిం పజేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాల కష్ణయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, జిల్లా నాయకులు రామ్మోహన్, చంద్రారెడ్డి, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, నగర కార్యదర్శి ఓబులేష్, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు రామకష్ణారెడ్డి పాల్గొన్నారు.










