
పంటల బీమాను ప్రభుత్వమే అమలు చేయాలి
- ప్రయివేట్ ఇన్సూరెన్స్ కంపెనీల జోక్యాన్ని నివారించాలి
- రూ. 700 కోట్లు కొల్లగొట్టాయి
- రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
పంటల బీమాను రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేసి రైతులను ఆదుకోవాలని, ప్రయివేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రమేయాన్ని నివారించాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నంద్యాలలోని నూనెపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో జీవో 660ని రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు జిల్లా కార్యదర్శి ఏ.రాజశేఖర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పంటల బీమా ఇన్సూరెన్స్‌లో ప్రయివేట్ కంపెనీలు చొరబడి రైతులకు నష్టం చేసే అవకాశం ఉందన్నారు. 2020-21, 2021-22లో రాష్ట్ర ప్రభుత్వమే నష్టపోయిన ప్రతి పంటకు పంటల బీమాను అమలు చేసిందని, నష్టపోయిన ప్రతి పంటకు మెరుగైన నష్టపరిహారం వచ్చిందని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1800 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీలకు కడితే రైతులకు కేవలం చెల్లించింది రూ. 1100 కోట్లు మాత్రమే నని, ఇంకా దాదాపు రూ.700 కోట్లను కంపెనీలు కొల్లగొట్టాయని విమర్శించారు. వాస్తవంగా గత సంవత్సరం కూడా రూ. 3 వేల కోట్లు పరిహారం రావాల్సి ఉండగా కేవలం రూ.1100 కోట్లు మాత్రమే రైతులకు బీమా కింద చెల్లించారన్నారు. బీమాలో అక్రమాలు జరగకుండా పూర్తి స్థాయిలో రైతులకు అందాలంటే ప్రయివేట్ కంపెనీల ప్రమేయం కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమాలో చేరితేనే కేంద్రం వాటా 50 శాతం ఇస్తానని ఒత్తిడి చేసిందని, కేంద్రం ఇచ్చే 50 శాతానికి ఆశ పడి రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గి రైతుల భవిష్యత్‌ను ఇన్సూరెన్స్ కంపెనీల చేతుల్లో పెట్టి, బాధ్యత నుండి తప్పుకుంటుందని విమర్శించారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే జగన్ ప్రభుత్వానికి ఇది ఏరకంగా తగునని ప్రశ్నించారు. రైతుకు ప్రతి ఎకరాకు ఏ పంట నష్టపోయిందో ఆ పంటకు స్కేల్ ఆఫ్ పంటలకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టి.రమేష్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకురాలు నాగరాణి, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శులు టి.రామచంద్రుడు, సురేష్, ఉపాధ్యక్షులు సుబ్బారాయుడు, వెంకటేశ్వర రావు, నాయకులు ప్రసాద్, వ్యకాసం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నాగేశ్వరరావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.