
ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : పంటల బీమాలో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల ప్రవేశం నిలిపివేయాలని ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, సిపిఎం పట్టణ కార్యదర్శి నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటల బీమాపై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 660ను రద్దుచేయాలని ఆర్డీవో తిప్పేనాయక్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ.. 2023-24 పంటల బీమాపై ప్రభుత్వం 8-9-2023ర జీవో నెంబర్ 660ను విడుదల చేసిందన్నారు. ఆ జీవోను రద్దుచేయాలని, పంటల బీమాతో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రవేశం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పంటల బీమా రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేయాలన్నారు. 2023-24 ఖరీప్ సీజన్లో పంటల బీమా అమలు కోసం రాష్ట్రప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీతో బిడ్డింగ్ నిర్వహిచిందన్నారు. పంటల బీమా విషయంలో రైతులకు నష్టం కల్గించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఖరీప్‌లో పంట నష్టపోయిన రైతులకు పంటల బీమాను సకాలంలో అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం మండల అధ్యక్షులు కొత్తపేట మారుతి, నాయకులు ఎల్.ఆదినారాయణ, ఓబుళేసు, బాబు పాల్గొన్నారు.