Sep 17,2023 16:39

డిఆర్ఓకు వినతిపత్రం సమర్పిస్తున్న రైతు సంఘం నాయకులు

పంటల బీమా పై జిఒ 660 రద్దు చేయాలి
ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల ప్రవేశం నిలిపివేయాలి
రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా అమలు చేయాలి
ఏపీ రైతు సంఘం నేతలు డిమాండ్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్

      పంటల బీమా పై ప్రభుత్వం  విడుదల చేసిన జి. ఒ. నెం. 660 రద్దు చేసి,రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా ను అమలు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి,జిల్లా కార్యదర్శి ఏ. రాజశేఖర్ లు ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు. ఈ మేరకు వారు  పంటల బీమాను ప్రభుత్వమే అమలు చేయాలని కోరుతూ డి ఆర్ ఓ పుల్లయ్య ను కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్బంగా కె ప్రభాకర్ రెడ్డి, ఏ రాజశేఖర్ లు మాట్లాడుతూ 2023-24 ఖరీఫ్ సీజన్ లో పంటల బీమా అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలతో బిడ్డింగ్ నిర్వహించిందని రాష్ట్రంలోని 26 జిల్లాలను వాతావరణ బీమా 9 క్లస్టర్లుగా, దిగుబడి ఆధారిత బీమా 7 క్లస్టర్లుగా నిర్ణయించి అమలు చేయ నున్నట్లు ఈ నెల 8 వ తేదీన జి. ఒ. నెం. 660ని ప్రభుత్వం విడుదల చేసిందని తక్షణమే ఆ జీవో ను  రద్దు చేయాలని కోరారు.ఈ జి. ఒ. వలన పంటల బీమా విధానం రైతులకు నష్టం చేసేది గాను, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రయోజనాల కొరకు ఉపయోగపడేదిగా ఉందని వివరించారు.2020 నుండి 2023 వరకు మూడు సంవత్సరాల పంటల బీమా అమలు అనుభవం పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పంటల బీమా అమలు చేసిన 2020-21లో రూ. 1700 కోట్లు, 2021-22లో రూ. 2,900 కోట్లు రైతులకు పంటల బీమా రూపంలో ప్రయోజనం కలిగిందన్నారు. ఉన్నంతలో  రైతులకు  ఎక్కువ ప్రయోజనం కలిగిందని వారు పేర్కొన్నారు. 2022-23 లో ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు జరిగిన పంటల బీమా పథకం వలన రైతులకు కేవలం రూ. 1100 కోట్లు మాత్రమే బీమా పరిహారం వచ్చిందని ఈ అనుభవం దృష్ట్యా పంటల బీమా లో ఇన్సూరెన్స్ కంపెనీల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా పథకం అమలు చేయాలని వారు కోరారు.  రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు కొరకు  విడుదల చేసిన జి. ఒ. 660 రద్దు చేసి రైతంగాన్ని ఆదుకోవాలని వారు కోరారు. పంటల బీమా పధకం రాష్ట్ర ప్రభుత్వమే తన బాధ్యతగా అమలు చేయాలని,కేంద్ర ప్రభుత్వం వత్తిడికి లొంగి పంటల బీమా పధకంలో ఇన్సూరెన్స్ కంపెనీలను అనుమతించవద్దని వారు కోరారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా పాలసీ ఇన్సూరెన్స్ కంపెనీల లాభాల కొరకే తప్ప రైతుల ప్రయోజనం కొరకు కాదని కాబట్టి  ప్రధాన మంత్రి ఫసల్ బీమా అమలు నిలిపివేయాలన్నారు. 2022-23 సంవత్సరంలో  నష్ట పోయినా పంటలకు పంటల బీమా అమలు కాని రైతులు అందరికీ  పంటల బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.  డి ఆర్ ఓ కు వినతిపత్రం సమర్పించిన వారిలో జిల్లా సహాయ కార్యదర్శులు టి.రామచంద్రుడు,సురేష్ తదితరులు ఉన్నారు.