Nov 21,2023 21:23

బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి - పార్వతీపురం : పంట రుణాలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల (డిస్ట్రిక్ట్‌ కన్సల్టేటివ్‌ కమిటీ) సమావేశం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుండి వర్చువల్‌ విధానంలో మంగళ వారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ ముఖ్యమైందని ఈనెలాకరుకు కనీసం 80 శాతం రుణాలు ఇవ్వాలన్నారు. బ్యాంకు బిజినెస్‌ కరెస్పాండెంట్లను పూర్తి స్థాయిలో నియమించాలన్నారు. జగనన్న తోడు కార్యక్రమంలో బ్యాంకులు బాగా చేశారని ఆయన ప్రశంసించారు. పిఎం స్వనిధి సంబంధిత దరఖాస్తులు ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆయన సూచించారు. పిఎంఇజిపి పథకం కింద తిరస్కరించిన దరఖాస్తులకు సంబంధించిన కారణాలు సమర్పించాలని ఆదేశించారు. జాయింట్‌ లయబిలిటీ గ్రూపులకు ప్రాధాన్యతా క్రమంలో రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో 600 కొత్త గ్రూపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ రైతులతో జాయింట్‌ లయబిలిటీ గ్రూపులను ఏర్పాటు చేయాలని సూచించారు. అటవీ ఫలసాయాలు, ఇతర పంటల దిగుబడి సమయంలో దళారులు ప్రవేశించి గిరిజన రైతులను మోసగించే అవకాశాలు ఎక్కువగా జరుగుతుంటాయన్నారు. ఎటువంటి చర్యలకు అవకాశం లేకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలన్నారు. ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ రైతులకు రుణాలు మంజూరు చేయాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రికి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలియజేశామని అన్నారు.
బ్యాంకు గ్యారంటీ విడుదల చేయాలి
జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్‌ అన్నారు. ఇందుకు బ్యాంకులు రైస్‌ మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీలు తక్షణం ఇవ్వాలని ఆదేశించారు. రిజర్వ్‌ బ్యాంకు అధికారి పిఎం పూర్ణిమ మాట్లాడుతూ అన్ని బ్యాంకుల అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలన్నారు. ప్రాధాన్యతా రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు. నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్‌ టి.నాగార్జున మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో జాయింట్‌ లయబిలిటీ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ జెఎల్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర జిల్లాలో జరుగుతోందని, అందులో అర్హులందరికీ బ్యాంకు సేవలు అందించాలని అన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోవింద రావు, సివిల్‌ సప్లరు జిల్లా మేనేజర్‌ ఎం.డి.నాయక్‌, బిస, సాంక్షేమశాఖ ఇడిలు ఎస్‌.కృష్ణ, ఎం.డి.గయాజుద్దీన్‌, డిఎస్‌ఒ ఆర్‌.శివప్రసాద్‌, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.వి.కరుణాకర్‌, టిపిఎంయు ఎపిడి వై.సత్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.