Oct 25,2023 21:40


ప్రజాశక్తి - గోకవరం మండలంలోని వరి పంట పొలాలకు సాగునీటిని అందించి రైతులను ఆదుకోవాలని టిడిపి రైతు విభాగం అధ్యక్షులు చంతల రామకృష్ణ కోరారు. ఈ మేరకు తహశీల్దార్‌ శ్రీని వాస్‌కు ఆయన బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూరంపాలెం ప్రాజెక్టు నుంచి నీరు అందక కామరాజుపేట, కొత్తపల్లి, రంప ఎర్రంపాలెం, పెంటపల్లి, వెదురుపాక, తిరుమలాయపాలెం గ్రామాల్లో పంట పొలాలు ఎండిపోతున్నాయని అన్నారు. వరి పంట ప్రస్తుతం పొట్ట దశలో ఉన్నాయని, ఈ సమయంలో నీరు అందకపోతే అన్నదాతలకు తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. సూరంపాలెం ప్రాజెక్టు కాలువలో జమ్మూ, గుర్రపుడెక్క పిచ్చి మొక్కలు పెరిగిపో యాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని విడుదల చేసినా చివారు పంటలకు నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాన కాలువలో పూడికను తీయకపోవడం వల్లే నేడు ఈ దుస్థితి వచ్చిందన్నారు. యుద్ధప్రాతిపాదికిన సూరం పాలెం కాలువను శుభ్రం చేయకపోతే ే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు వల్లభ రాయుడు, కొత్తపల్లి వెంకటరావు, అప్పలస్వామి తదితర రైతులు పాల్గొన్నారు.