ప్రజాశక్తి-అనకాపల్లి
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు నష్టపరిహారం అందించాలని ఎపి కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.బాలకృష్ణ, రైతు సంఘం నాయకులు కాళ్ల తేలయ్యబాబు, బుద్ధ రంగారావు బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు క్షేత్రాలకు వ్యవసాయ అధికారులు రాకుండానే పంట నష్టాలను ఎలా అంచనా వేస్తారని ప్రశ్నించారు. పంటలో మూడో వంతు పూర్తిగా నష్టపోతేనే పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం నిబంధన రైతుల పాలిట ఉరితాడుగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులు స్పందించి నష్టపోయిన రైతులను, కౌలుదారులను గుర్తించి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు అందుబాటులో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రంగు మారిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని కోరారు. స్వామినాథన్ సిఫారసుల మేరకు పంట నష్ట పరిహారం ఇవ్వాలన్నారు.










