ప్రజాశక్తి-బాపట్ల: రాష్ట్రంలో గత పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు వేగేశన నరేంద్ర వర్మ కోరారు. మంగళవారం బాపట్ల తహశీల్దారు చిన్నం సుధారాణికి వినతిపత్రం పార్టీ నాయకులతో కలిసి నరేంద్రవర్మ అందజేశారు. ఈ సందర్భంగా నరేంద్రవర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో పంటలు నీటిలో నాని నష్ట తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందన్నారు. వరిధాన్యంతో పాటు మిరప, మొక్కజొన్న, పసుపు, శనగ, వేరుశనగ, మామిడి, అరటి, ఇతర ఉద్యాన పంటలు బొప్పాయి, నిమ్మ, దానిమ్మ, బత్తాయి దెబ్బతిని రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. పంట నష్టం అంచనా వేసి త్వరితగతిన పరిహారం అందించాలని పేర్కొన్నారు. నష్టపోయిన వరి, మొక్కజొన్న రైతుకు ఎకరానికి రూ.30 వేల చొప్పున పరిహారం అందజేయాలన్నారు. ఈ మేరకు తహశీల్దారుకు వినతిపత్రం అందజేశామని, కార్యక్రమంలో మానం విజేత, జిట్టా ప్రమీల రాణి, పమిడి భాస్కరరావు, చుండూరుపల్లి శివ, నక్కల వీరరాఘవయ్య, గొలపల శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.










