Nov 09,2023 23:12

  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ప్రజాశక్తి-నందిగామ
తీవ్ర వర్షాభావం వల్ల పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. నందిగామ నియోజకవర్గ ప్రాంతంలో నీరందక దెబ్బతిన్న పత్తి పంటను సిపిఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌తో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మునగచర్ల, అనాసాగరం గ్రామాలలో వేదాద్రి ఎత్తిపోతల పథకం అందుబాటులో ఉన్నా నీరందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జిల్లాలో 14 కరువు మండలాలు ఉంటే రెండు మండలాలనే ప్రకటించడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు వల్ల దెబ్బతిన్న పంటలకు పంటల భీమా కల్పించాలని, రైతులకు న్యాయం చేయాలని 20, 21 తేదీల్లో కరువు దీక్ష చేపడతామన్నారు. కరువు సమస్యపై క్యాబినెట్లో చర్చించకపోవడం బాధాకరమన్నారు. రైతుల సమస్యల గురించి చర్చించని క్యాబినెట్‌ రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైన మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, వర్షాభావం వల్ల ఎండిపోయిన పంటలను సర్వే చేసి రైతులకు వంట నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ సుబ్బారావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు లంకా దుర్గారావు, కొట్టు రమణ, తాడి పైడియ్య, కట్టా చామంతి, మన్నే హనుమంతరావు, పరుచూరి రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.