Mar 24,2023 23:57

దెబ్బతిన్న నువ్వు పంటను పరిశీలిస్తున్న మోహనరావు

ప్రజాశక్తి -మునగపాక రూరల్‌
అకాల వర్షాల కారణంగా మండలంలోని మునగపాక, చూచుకొండ గణపర్తి వాడ్రాపల్లి గ్రామాలలో నీట మునిగిన నువ్వు చేలు, పొద్దుతిరుగుడు పంటలను శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రావు పరిశీలించారు. స్థానిక రైతులతో సమావేశం నిర్వహించారు. పంట నష్టంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షానికి పంటలు ఎంతవరకు నీట మునిగాయి? ఎన్ని ఎకరాలలో నష్టం వాటిల్లిందో తెలిపే నివేదిక సమర్పించాలని స్థానిక విఏఏలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జోష్నా కుమారి, విఏఏలు నవ్య శ్రీ, శ్వేతా మీనన్‌, తులసి, ఏఈఓ లక్ష్మి, రైతులు పెంటకోట రఘురాం, మద్దాల నర్సింగరావు, పెంటకోట ఆదిరత్నం నాయుడు, రాము పాల్గొన్నారు.
యలమంచిలి : మండలంలో అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని యలమంచిలి వ్యవసాయ ఏడి రవిప్రకాష్‌ అన్నారు. మండలంలోని సోమలింగపాలెం గ్రామం శుక్రవారం ఆయన పర్యటించి వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు. పూతదశలోను, కాయ దశలోను ఉన్న నువ్వుపంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. నువ్వు పంట రైతులకు పలు సూచనలు చేశారు. నిల్వనీరు తీసేసి, ఎకరాకు 18 కేజీల యూరియా చల్లాలని సూచించారు. గింజదశ పంటకు 19:19:19 (పొటాష్‌) 5 గ్రాములు లీటరుకు కలిపి మొక్కలు తడిచేలా పిచికారి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌ఎ స్వాతి, లలిత, ఏఇఒ దేవుడు పాల్గొన్నారు.