ప్రజాశక్తి - వేపాడ : మండలంలోని వీలుపర్తి రెవెన్యూ పరిధిలో గల గోపాల రాయుడు చెరువు, కనుముల చెరువు, నాగారాయుడు చెరువు కింద ఉన్న ఆయకట్టు రైతుల వరి పంట పొలాలు వర్షాలు లేక ఎండిపోయాయి. పంట నష్ట పరిశీలన చేయాలని రైతులు సచివాలయ అగ్రి కల్చర్ అసిస్టెంట్ జ్యోతిని కోరగా బుధవారం ఆమె పంట నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మద్దాల నాయుడు మాట్లా డుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతును ఆదుకోవాలని కోరారు.
ప్రభుత్వం వరి రైతును ఆదుకోవాలి
నెల్లిమర్ల: ప్రభుత్వం వరి సాగు చేస్తున్న రైతును వెంటనే ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు కిల్లంపల్లి రామారావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన తెగుళ్ల సోకిన వరిపంటను జరజాపుపేటలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో వర్షభావ పరిస్థితుల్లో వరిపంటకు తెగుళ్లు సోకి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వర్షం లోటు ఒకపక్క దోమపోటు, అగ్ని తెగులు సోకి మరో పక్క 50 శాతం పంట కూడా దక్కే పరిస్థితి లేదన్నారు. ఎకరానికి 50వేలకు పైగా ఖర్చు పెట్టిన రైతుకి ప్రస్తుతం తిండి గింజలు కూడా రాని పరిస్థితి ఉందన్నారు. అధికార్లు ఏదో మొక్కుబడిగా వచ్చి పంటలను పరిశీలించి వెళ్తున్నారు గాని వారికి అవసరమైన పంటను ఎలా కాపాడుకోవాలన్న విషయాలు చెప్పలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తెగుళ్లుకు తోడు పందులు కూడా వరి చెలోకి వచ్చి పంటను నాశనం చేస్తున్నాయన్నారు. వరి తెగుళ్ల నుంచి కాపాడు కోవడానికి కాలువలు వేసినా ప్రయోజనం కనిపించడం లేదని పంట కోత దశలో ఉన్నా పురుగుల మందులు కొట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు.
అన్నదాత పై ప్రభుత్వానికి అంత నిర్లక్ష్యమా?
అన్నం పెట్టే అన్నదాతపై ప్రభుత్వానికి అంత నిర్లక్ష్యమా అని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ బుధవారం ఒక ప్రకటనలో అన్నారు. నియోజకవర్గం పరిధిలో వర్షాభావ ప్రభావం వల్ల అనేక మంది రైతులు పంట నష్టపోయారని, అన్నదాతకు ఇంత నష్టం జరుగుతున్నా అధికార పార్టీ నాయకులు రైతుల వైపు కన్నెత్తి చూడకుండా బస్సు యాత్రలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఎస్ కోట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడానికి ఏ ఒక్క నాయకుడు కృషి చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా స్థానిక నాయకులు, అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేసి వరి పంట నష్టపోయిన రైతులను గుర్తించి వారిని ఆదుకోవాలని కోరారు.