May 07,2023 23:47

గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఆకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై పరిశీలి స్తున్నామని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎన్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈనెల 10వ తేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షాలు పూర్తిగా తగ్గగానే నష్టం వివరాలు పూర్తిగా నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు. ప్రస్తుతం ప్రాథమిక అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని, వర్షాలు కొనసాగితే ఇంకా నష్టం పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజాశక్తి ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు తెలిపారు.
అకాల వర్షాల వల్ల ఏయే పంటలకు నష్టం?
జొన్న, మొక్కజొన్న, ఆలస్యంగా సాగు చేసిన మిర్చి పంటలకు నష్టం ఉంది. నష్టం తీవ్రత ఎంత ఉందనే అంశంపై వర్షాలు తగ్గిన తరువాతనే పూర్తిస్థాయిలో సర్వే చేస్తాం. తరువాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం.
ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం ఎంత?
గుంటూరు జిల్లాలో మొక్కజొన్న 60 వేల ఎకరాలు, 30 వేల ఎకరాల్లో జొన్న సాగు చేశారు. మొత్తం సాగులో 70 శాతం మొక్కజొన్న, 95 శాతం జొన్న కోతలు పూర్తయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం పంట కోయకుండా ఉన్న వాటిల్లో ఐదు వేల ఎకరాల్లో మొక్కజొన్న, 3 వేల ఎకరాల్లో జొన్న పంటకు నష్టం వాటిల్లినట్లు గుర్తించాం.
పంటను కాపాడుకునేందుకు ఏంచేయాలి?
పంటపై ఉప్పు ద్రావణం పిచికారి చేయాలి. పరిస్థితులను బట్టి రైతుల ఈ ప్రక్రియ కొనసాగించాలి. కొన్నిచోట్ల పంట చివరి దశలో ఉన్నందున పరిశీలన అవసరం.
మిర్చి పంటకు ఎంత వరకు నష్టం ఉంటుంది?
మిర్చి ఆలస్యంగా సాగు చేసిన ప్రాంతాల్లో కొంతనష్టం జరిగింది. అక్టోబరు కంటే ముందు సాగు చేసిన ప్రాంతాల్లో కోతలు పూర్తయ్యాయి. అక్టోబరు తరువాత సాగు చేసిన ప్రాంతాల్లో చివరిదశ కోతల సమయంలో వర్షాలకు కొంత నష్టమైనట్లు భావిస్తున్నాం. మిర్చి నష్టం అంచనాలను ఉద్యాన శాఖ పరిశీలిస్తుంది.
రానున్న ఖరీఫ్‌ సీజన్‌కు సన్నద్ధత?
ఆర్‌బికేల ద్వారా అన్ని రకాల విత్తనాలను సిద్ధం చేస్తున్నాం. తొలి దశలో తొలకరి పంటలుగా పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధం చేస్తున్నాం. జనుము, జీలుగ, పిల్లిపెసర విత్తనాలు ఇప్పటికే ఆర్‌బికేల్లో అందుబాటులో ఉంచాం. వీటిని రైతులు 50 శాతం సబ్సిడీతో తీసుకోవచ్చు.
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు?
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు (సిసిఆర్‌సి) ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. గతేడాది ఇచ్చిన రైతులు అదే పొలంలో కొనసాగితే వాటిని భూ యజమానులతో మాట్లాడి రెన్యూవల్‌ చేస్తాం. భూమి మార్చుకుంటే కొత్త దరఖాస్తు తీసుకుని సిసిఆర్‌సిలు ఇస్తాం.
రైతు భరోసా, పిఎంకిసాన్‌ దరఖాస్తు చేయాలా?
ఈ ఏడాది రైతు భరోసా, పిఎం కిసాన్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేయనక్కర్లేదు. గతేడాది తీసుకున్న రైతుల పేర్లను పరిశీలించి ప్రభుత్వానికి పంపుతున్నాం. భూ యజమాని మారినా, ఎవరైనా మరణించినా, ఇతర అంశాలు ఏమైనా ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. మిగిలిన వారికి అవసరం లేదు. ఇకెవైసి చేసుకున్న వారికే పిఎం కిసాన్‌ పథకం వస్తుంది. ఇప్పటి వరకు చేసుకోని వారు వెంటనే ఆర్‌బికేల్లో, మీ-సేవా కేంద్రాల్లో ఇకెవైసి చేసుకోవాలి.