
పంట నమోదు వివరాలు సరిచూసుకోండి
- జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ
రైతు భరోసా కేంద్రాలలో ఖరీఫ్-2023 పంట వివరాలను సోషియల్ ఆడిట్ కోసం ప్రదర్శించారని, రైతులు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు అన్నారు. గురువారం మండలంలోని పేరాయిపల్లె, జి.జంబులదిన్నె గ్రామాలలో జొన్న, మినుము పంటలను ఆయన పరిశీలించారు. పంటల స్థితిగతులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ పంట నమోదు పూర్తి అయిందని, రైతుల జాబితా ఈ నెల 26 నుంచి 29 వరకు ప్రతి రైతు భరోసా కేంద్రంలో ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ప్రతి రైతు చూసుకొని పేరు, విస్తీర్ణం, పంట, నీటి వసతి ఇతర ఏమైన పొరపాట్లు ఉంటే గ్రీవెన్స్ రూపంలో అర్జీ అందజేసి రైతు భరోసా సిబ్బందికి తెలియజేసి సరిచేసుకోవాలని తెలిపారు. అన్ని గ్రామాలలో సోషల్ ఆడిట్ జరిపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో నంద్యాల ఎడిఎ చెన్నయ్య, ఎఒ కిషోర్ కుమార్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి హుస్సేన్ బాషా, విఎఎలు షాహిన్, హరినాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు. రుద్రవరం : ప్రతి రైతు సాగు చేసిన పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని, అప్పుడే వ్యవసాయ శాఖ తరపున అందించే సంక్షేమ పథకాలకు అర్హులవుతారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రావు తెలిపారు. గురువారం మండలంలోని కోటకొండ, ఎల్లావత్తుల, చిన్నకంబలూరు, పెద్దకంబలూరు, రుద్రవరం రైతు భరోసా కేంద్రాలలో ఖరీఫ్-2023 సంవత్సరం సంబంధించి ఈ క్రాప్ సామాజిక తనిఖీ కోసం ప్రదర్శించిన ముసాయిదా జాబితాను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు రామ్మోహన్ రెడ్డి, ఎడి చెన్నయ్య, టెక్నికల్ ఏఓ నాగేంద్రప్రసాద్, మండల వ్యవసాయ అధికారి శ్రీకృష్ణ, విస్తరణ అధికారి రాజు, కార్యదర్శులు షాహినూర్, పాములేటి, కళావతి, గ్రామ సర్పంచులు డేగాని వెంకటేష్, చెన్నప్ప, రైతు భరోసా కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.