Oct 02,2023 00:30

ఎమ్మెల రామయ్య కాలనీలో ప్రచారం చేస్తున్న సిపిఎం శ్రేణులు

ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్‌ : స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నుండి 12వ తేదీ వరకూ సిపిఎం నిర్వహించే పాదయాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు జొన్న శివశంకరరావు పిలుపుని చ్చారు. ఈ మేరకు కుంచనపల్లిలోని మదర్‌ థెరిస్సా కాలనీలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. తాడేపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయని, ఇళ్ల స్థలాలు, రోడ్లు, డ్రెయినేజీ, తాగునీటి సమస్యలతో జనం ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కుంచనపల్లి ఆంధ్రరత్న పంపింగ్‌ స్కీం పంట కాల్వ మురుగునీటితో కలుషితమైందని, నీరుకు బదులు మురుగు పారుతుండడంతో పంట పొలాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. కాల్వల పూడికతీత చేపట్టకపోవడంతో అధిక వర్షాలు పడినప్పుడు పైర్లు ముంపు బారిన పడుతున్నాయని, అయినా ప్రజాప్రతి నిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పొలాలకు సాగునీరు అందించాలని, అపార్టుమెంట్లలోని వ్యర్థపు నీరు మురుగు కాల్వల్లో కలవకుండా చూడాలని కోరారు. సిపిఎం మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి మాట్లాడుతూ పిడబ్ల్యూడి కాల్వకట్లపైన కుంచనపల్లి పరిధిలో 300 కుటుంబాలు 30 ఏళ్ల క్రితం ఇళ్లేసుకుని నివాసం ఉంటున్నారని, వాటిని తొలగిస్తామంటూ అధికారులు నోటీసులు ఇవ్వడం అన్యాయమని అన్నారు. కాల్వకట్లపై నివాసం ఉండే పేదల ఇళ్ల స్థలాలను రెగ్యులర్‌ చేసి, పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. వడ్డేశ్వరంలో ఇళ్లు లేని నిరుపేదలు నివాసం ఉంటున్న ఇళ్ల స్థలాలను, కొలనుకొండలోని కొండ పోరంబోకులో ఇళ్లేసుకున్న వారికి పట్టాలి వ్వాలన్నారు. మెల్లెంపూడి ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మౌలిక వసతుల్లేక జనం ఇబ్బందులు పడుతున్నారని, పల్లంగా ఉన్న గ్రామాల్లో సిసి రోడ్ల ఎత్తు పెంచి వేయాలని, డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, తాగునీరు సరఫరా చేయాలని, ప్రాతూరు, గుండిమెడ గ్రామాల్లో ఇసుక క్వారీలను తెరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ అన్ని సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పాదయాత్ర చేస్తోందని, ప్రజలంతా మద్దతుగా కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం కుంచనపల్లి గ్రామ శాఖ కార్యదర్శి ఎ.రంగారావు, నాయకులు ఎ.రామారావు, బి.మోసే, ప్రకాష్‌, నాగార్జున పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : నియోజకవర్గంలో మంగళవారం నుండి జరిగే ప్రజా చైతన్య పాదయాత్రలో ప్రజలు తమ సమస్యలను యాత్ర దృష్టికి తేవాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ మేరకు పట్టణంలోని ఎమ్మెల రామయ్య కాలనీలో ఆదివారం కరపత్రాలను పంపిణీ చేసి ప్రచారం చేపట్టారు. అనంతరం తాడేపల్లి మేకా అమరారెడ్డి భవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. తాడేపల్లిలో ప్రధాన సమస్యగా ఉన్న ఇళ్లపట్టాల సమస్యను పరిష్కరించాలని, నివాసం ఉన్న చోటనే పట్టాలు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని పేదలకు రెండు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిఎం ఇంటి సమీపంలో బకింగ్‌హోమ్‌ కెనాల్‌పై డబుల్‌ లైన్‌ బ్రిడ్జి నిర్మించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా నిర్మించాలని, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, నాయకులు డి.శ్రీనివాసకుమారి, వి.దుర్గారావు, ఎస్‌.ముత్యాలరావు, భాస్కరరెడ్డి, డి.కోదండరామయ్య, వెంకన్న పాల్గొన్నారు.