పంట కాల్వలకు జలకళ
ప్రజాశక్తి - ముదినేపల్లి
మండలంలోని ప్రధాన పంట కాల్వలైన సిబి కెనాల్, పోల్‌రాజ్ కెనాల్‌కు నిండా నీరు చేరుకుని జలకళ సంతరించుకుంది. సోమవారం వరకూ కాల్వ సామర్థ్యానికి తగ్గ నీటిని అధికారులు విడుదల చేయలేదు. కాల్వలో నీరు ప్రవహిస్తున్నా ఆనీరు మండలంలోని శివారు గ్రామాలకు చేరలేదు. దీంతో పలు గ్రామాల్లో మంచినీటి చెరువులు నింపుకునేందుకు తగిన నీరు కాల్వలకు విడుదల కాలేదు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏర్పడ్డ సమస్యల కారణంగా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయలేదని అధికారులు చెబుతున్నారు. గత పది రోజులుగా మండలంలోని ప్రధాన పంట కాల్వల్లో నిండా నీరు ప్రవహిస్తోంది. రెండు పంట కాల్వలకు నీరు నిండా రావడంతో కాల్వలు జలకళ సంతరించుకున్నాయి. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో పూర్తిగా నిమగమయ్యారు. పంట బొదెలను బాగు చేస్తూ, పొలంగట్లు సరి చేస్తున్నారు. మొన్నటి వరకూ వర్షాభావంతో కాల్వలకు నిండా నీరు రాక, వచ్చిన నీరు చేల్లో చేరే పరిస్థితి లేకపోవడంతో రైతన్నలు ఇక్కట్లు పడ్డారు. ప్రస్తుతం ప్రధాన పంటకాల్వల్లో పూర్తిస్థాయిలో నీరు ప్రవాహించడంతో పాటు, తరచూ వర్షాలు పడుతుండడంతో రైతన్నలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.










