ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జలవనరులు, పంటకాల్వలు బలోపేతానికి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టరు పి రంజిత్ బాషా చెప్పారు. జలవనరులు, పంటకాల్వల నిర్వహణపై మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. జలవనరులు సంరక్షణ, సమస్యల పరిష్కారానికి స్థిరమైన నిబంధనలతో శాశ్వత ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టరు తెలిపారు. జూన్ 9 లేదా 10వ తేదీల్లో సాగర్ జలాలను ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. సాగర్ జలాలు ప్రవేశించగానే జిల్లాలోని తాగునీటి చెరువులన్నింటినీ పూర్తిగా నింపాలని కలెక్టరు తెలిపారు. సాగర్ కుడికాల్వ కింద 3.79 లక్షల ఎకరాల భూములు సాగవుతున్నాయన్నారు. జిల్లాకు 67 టిఎంసిల నీరు అవసరమని కలెక్టరు చెప్పారు. సాగర్ జలాలు వృథా కాకుండా అధికారులు ప్రణాళికాబద్ధంగా నిల్వ చేయాలన్నారు. కాల్వల మరమ్మతు పనులు టెండరు దశలో వుండగా మరికొన్నింటికి టెండర్లు పిలవకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పంటల సాగు ప్రారంభానికి ముందే జలవనరుల శాఖ అధికారులు, మురుగు నీటి కాల్వల నిర్వహణ అధికారులు అప్రమత్తం కావాలని ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి ఏటా నవంబరు నాటికే చెరువులు, కాల్వల మరమ్మతుల పనులపై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి పంపాలన్నారు. వేసవి రాక ముందే మరమ్మతు పనులు పూర్తిచేసేలా అధికారులు స్పష్టమైన నివేదికలు సిద్ధం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. పంటకాల్వల పూడికతీత పనులు, తూటికాడ, గుర్రపుడెక్క తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో 1,171 పనులు
ఉపాధి హామీ చట్టం అనుసంధానంతో 1,171 పనులు బాపట్ల జిల్లాలో చేపడుతున్నామని కలెక్టరు రంజిత్ బాషా చెప్పారు. రూ.61.70 కోట్లతో పనులు చేయడానికి ప్రభుత్వం ఆమోదించిందన్నారు. సామాజిక ప్రయోజనాల కోసం జలవనరుల వినియోగానికి ముందస్తుగా పనులు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి ఏటా జులై నాటికి మరమ్మతు పనులు పూర్తి చేస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. వేసవిలో పనులు చేయకపోతే రైతులకు అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. జలవనరుల శాఖ, వ్యవసాయశాఖ, మురుగు కాల్వల నిర్వహణ అధికారులు, ఏపిఎస్‌ఐడిసి అధికారులతో జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కమిటీలను నియమిస్తామని అన్నారు. కమిటీలు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నారు. జిల్లాలో 93 ఎత్తిపోతల పథకాలు నడుస్తుండగా 1.13 లక్షల ఎకరాల ఆయకట్టు భూములు సాగవుతున్నాయని వివరించారు. దిగువన ఉన్న ఆయకట్టు భూములన్నింటికీ సాగునీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ రంగంలో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం చూపాలని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. సాగర్ జలాలు జిల్లాలోకి ప్రవేశించిన తరువాత కాల్వల మరమ్మతు పనులు ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. వేసవికి ముందుగానే పనులు చేయాలని ఆయన సూచించారు. మేజర్ కాల్వలకు 14 మరమ్మతు పనులు మంజూరుకాగా నేటికీ పనులు పూర్తి చేయకపోవడం ఏమిటని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాల్వల పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన తెలిపారు. జులై నెలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరదలు వస్తే లోతట్టు భూములన్నీ మునిగి పంటలకు తీవ్ర నష్టం సంభవిస్తుందన్నారు. వాటిని ముందుగానే అరికట్టాలని అధికారులు ముందస్తు ప్రణాళికతో పని చేయాలన్నారు. ఆయకట్టు భూములకు శిస్తు వసూలు చేయాలని, అధికారిక ఆయకట్టు, అనధికార ఆయకట్టు భూముల పరిస్థితులను పరిశీలించాలన్నారు. ఉపాధి హామీ చట్టం అనుసంధానంతో కాల్వల మరమ్మతు పనులు సత్వరమే చేపట్టాలని అన్నారు.
పంట కాల్వలలో గుర్రపుడెక్క, తూటికాడ పూర్తిగా తొలగించాలని చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి చెప్పారు. కాల్వల ఎగువ ప్రాంతంలో కొందరు మోటార్లు ఉపయోగించి నీటిని దారిమళ్లిస్తున్నారని తెలిపారు. వాటిని అరికడితే దిగువ ప్రాంతంలోని ఆయకట్టు చివరి భూములన్నింటికీ సాగునీరు అందుతుందన్నారు. సాగుకాల్వల పూడికతీయకపోవడంతో గత ఏడాది చీరాలలో 3 వేల ఎకరాల వరి నారుమళ్లు దెబ్బతిన్నాయన్నారు. దిగుబడి వచ్చే సమయానికి వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతోనే ప్రతిఏటా రైతులు పలు విధాలుగా నష్టపోతున్నారని వివరించారు. వారి సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కార మార్గం చూపాలని ఆయన తెలిపారు. అనంతరం పలువురు రైతులు తమ ప్రాంతంలోని సాగునీటి కాల్వల పరిస్థితులను కలెక్టరు దృష్టికి తెచ్చారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టరు సిహెచ్ శ్రీధర్, డిఆర్‌ఓ కె లక్ష్మీశివజ్యోతి, మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరటయ్య, వ్యవసాయ, జలవనరులు, మురుగు కాల్వల నిర్వహణ శాఖ, ఏపిఎస్‌ఐడిసి అధికారులు, రైతులు పాల్గొన్నారు.










