
ప్రజాశక్తి-గొలుగొండ:జెడ్పిటిసి సభ్యులు సుర్ల వెంకట గిరిబాబు చొరవతో రైతుల పంట పొలాలలో నీటి కాలువల్లో ఏవుగా పెరిగిన తుప్పల తొలగింపునకు మోక్షం లభించింది. ఉపాధి హామీ పథకం ద్వారా రైతుల పంట పొలాల్లో నీటి కాలువలను తవ్వకాలు చేపట్టడం, ఏవుగా పెరిగిన తుప్పలను తొలగించేందుకు ఉపాధి హామీ పథకంలో ప్రాధాన్యత కల్పించాలంటూ గడచిన జిల్లా సర్వసభ్య సమావేశంలో జడ్పిటిసి సభ్యులు సుర్ల గిరిబాబు ఉన్నతాధికారులను కోరారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఇందుకు అనుగుణ ంగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో, మండలంలో పలుచోట్ల ఈ పథకం ద్వారా రైతుల పంట కాలువలను శుభ్రం చేసి, జంగిల్ క్లియరెన్స్ పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. రైతు పంట పొలాలలో జరుగుతున్న కాలువ పూడికతీత పనులను జడ్పిటిసి పరిశీలించారు. జెడ్‌పిటిసి గిరిబాబు చొరవతో పంట కాలువల పనులు చేపట్టడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.