Mar 01,2022 07:11

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూన్‌ 15న విడుదల చేసిన జీవో ఎమ్‌.ఎస్‌ నెం 35 ప్రకారం .. గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాలలో మిర్చి పంటకు బీమా లేదు. రాష్ట్రంలో 75 శాతం పంట ఈ మూడు జిల్లాలలోనే సాగు అవుతుంది. ఈ ఏడాది పంటల బీమా ప్రీమియం చెల్లించలేదని వార్తలు వెలువడుతున్నాయి. అధికారులు ఎవరూ పెదవి విప్పడం లేదు. పంటల బీమా సంగతి ప్రశ్నిస్తే రైతులను ఆదుకుంటామని, నష్టపరిహారం ఇస్తామని చెప్పి దాటవేస్తున్నారు.

    న రాష్ట్రంలో మిర్చి సాగు చేసిన రైతాంగం ఏనాడూ లేనంత కష్టాలలో ఉంది. పూత, పిందె దశలో ఉన్న మిరప పంటకు తామర వైరస్‌ సోకడంతో ఎన్నడూ ఎరుగనంత నష్టం జరిగింది. మిరప చేలన్నీ నిలువునా మాడిపోయాయి. ఎన్ని క్రిమిసంహారకాలు వాడినా ఫలితం లేకపోయింది. గత ఏడాది మిర్చి దిగుబడులు బాగున్నాయి. ధరలు కూడా బాగున్నాయి. రైతాంగం గతంలో చేసే సాగుకన్నా ఎక్కువగా మిర్చి సాగు చేశారు. రాష్ట్రంలో మిర్చి పంట సగటు సాగు విస్తీర్ణం 3.80 లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది 5.25 లక్షల ఎకరాలు సాగు చేశారు.
    రైతు ఎకరాకు లక్ష రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టగా కౌలు రైతు అదనంగా ఎకరాకు రూ.30 వేలు పైగా ముందస్తుగానే కౌలు చెల్లించారు. కౌలు రైతులకు బ్యాంకుల నుండి రుణాలు రాకపోవడంతో అధిక వడ్డీలకు తెచ్చి పెట్టారు. అప్పుల బాధకు తాళలేని పేద రైతుల, కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ రెండు మాసాలలోనే ప్రకాశం, గుంటూరు, కృష్ణా, జిల్లాలలో 20 మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. బలవన్మరణాలకు పాల్పడిన కుటుంబాలు తల్లడిల్లిపోతుండగా, నిత్యం వస్తున్న ఆత్మహత్యల వార్తలు రైతాంగాన్ని మరింత కుంగదీస్తున్నాయి.
    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం పర్యటన జరిపి రెండు మాసాలు గడిచింది. ప్రభుత్వాల నుండి ఇంతవరకు ఏ సమాచారం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ లోనే సుమారు రూ. 6 వేల కోట్లు పెట్టుబడి హారతి అయిపోయింది. సవ్యంగా ఉంటే కనీసం రూ. పది వేల కోట్ల ఖరీదు చేసే మిరప పంట దిగుబడి అయ్యేది. అయినా కేంద్ర ప్రభుత్వం తాత్సారంగా వ్యవహరించడం క్షంతవ్యం కాదు.
    రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూన్‌ 15న విడుదల చేసిన జీవో ఎమ్‌.ఎస్‌ నెం 35 ప్రకారం ...రాష్ట్రంలో ఏ ఏ పంటలకు, ఏ ఏ జిల్లాలకు పంటల బీమా పథకం వర్తించేది ఇచ్చింది. ఆ జీవో ప్రకారం గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాలలో మిర్చి పంటకు బీమా లేదు. రాష్ట్రంలో 75 శాతం పంట ఈ మూడు జిల్లాలలోనే సాగు అవుతుంది. ఈ ఏడాది పంటల బీమా ప్రీమియం చెల్లించలేదని వార్తలు వెలువడుతున్నాయి. అధికారులు ఎవరూ పెదవి విప్పడం లేదు. పంటల బీమా సంగతి ప్రశ్నిస్తే రైతులను ఆదుకుంటామని, నష్టపరిహారం ఇస్తామని చెప్పి దాటవేస్తున్నారు.
 

                                                          ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం

2016లో కేంద్రప్రభుత్వం అప్పటి వరకు అమలులో ఉన్న జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకం వాతావరణ విపత్తుల పంటల బీమా పథకం, మోడిఫైడ్‌ పంటల బీమా పథకాలను కలిపి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం ప్రవేశపెట్టింది. 2016లో మధ్యప్రదేశ్‌లో ఈ పథకం ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ పథకం వలన పంట నష్టపడిన ప్రతి రైతుకూ బీమా పరిహారం వస్తుందని చెప్పారు. అదే రాష్ట్రంలో 2019లో మహేశ్‌ జాగేశ్వర్‌ రామ్‌కుచే అనే రైతు 1.27 హెక్టారులలో సోయాబీన్‌ పంట వేసి పూర్తిగా నష్టపోయాడు. అయితే కేవలం 2 రూపాయలు మాత్రమే పంటల బీమా కంపెనీ నుండి పరిహారం వచ్చిందని, ఏటా తన కిసాన్‌ క్రెడిట్‌ కార్డు అకౌంట్‌ నుండి రూ.12,000 కట్‌ అవుతుందని చెప్పారు.
    ఈ పథకం ప్రకారం రైతు ఆహార, పప్పుధాన్యాల పంటలకు ఖరీఫ్‌లో 2 శాతం... రబీలో 1.5 శాతం ప్రీమియం చెల్లించాలి. ఉద్యాన వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాలి. మిగిలిన ప్రీమియం మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున చెల్లించాలి. రైతులు బ్యాంకులో తీసుకునే పంటరుణం (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌) ఆధారంగా ప్రీమియం వసూలు చేస్తారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వ సంస్థ అయిన అగ్రికల్చరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియాతో పాటు, పది ప్రెయివేటు పంటల బీమా కంపెనీలను ఎంపిక చేసింది. ఈ కంపెనీలకు జిల్లాల వారీగా కేటాయింపులు చేసింది. 2018లో బీమా కంపెనీలు రైతులకు బీమా పరిహారం చెల్లించడం లేదని పార్లమెంట్‌లో చర్చ జరిగింది. ఆ సందర్భంగా ఇన్సూరెన్స్‌ కంపెనీలకు రూ.15,000 కోట్లు పైగా ప్రీమియం వసూలు అయ్యిందని, రైతులకు రూ.5,000 కోట్లు మాత్రమే పరిహారంగా చెల్లించాయని, ప్రయివేటు కంపెనీలు ఒక్కొక్క దానికి రూ.1000 కోట్లు చొప్పున లాభాలు వచ్చాయని, ప్రభుత్వ కంపెనీ అయిన అగ్రికల్చరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా ఒక్కటే పూర్తిగా నష్టపరిహారం చెల్లించిందని తేలింది. వ్యవసాయ అధికారులు పంటల దిగుబడి సర్వే సక్రమంగా చేయడం లేదని తమ కంపెనీల అధికారులతో నమూనా సేకరించామని దాని ప్రకారం పంటలు బాగానే పండాయని ప్రయివేటు కంపెనీలు వాదించాయి. ఈ పథకం ప్రకారం పంట మధ్య కాలంలో పంట నష్టం జరిగితే బీమా మొత్తంలో 25 శాతం వెంటనే చెల్లించాలన్న షరతు ఉంది. ఇప్పటి వరకు ఈ షరతు ఎక్కడా అమలు పరిచిన దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే ప్రీమియం ఎక్కువగా ఉందని, కంపెనీలు చెల్లించే బీమా పరిహారం తక్కువగా ఉందని వ్యవసాయక రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్‌, జార్ఖండ్‌, తెలంగాణ, బీహార్‌, గుజరాత్‌, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ 7 రాష్ట్రాలు ఈ పథకం నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాలు స్వంతంగా ఇన్సూరెన్స్‌ కంపెనీలను స్థాపించుకున్నాయి. ఈ కంపెనీలకు కేంద్రం ప్రీమియం చెల్లించడం లేదు.
 

                                                          వై.ఎస్‌.ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2019లో జీవో నెం 157 ద్వారా 2013 కంపెనీ యాక్ట్‌ కింద ''ఆంధ్రప్రదేశ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌'' ను ఏర్పాటు చేసింది. 101 కోట్లతో ప్రభుత్వ షేర్‌ కాపిటల్‌ ఏర్పాటు చేసింది. రైతు ఒక్క రూపాయి కడితే చాలని చెప్పింది. 2020 అక్టోబర్‌లో జీవో నెం 79 ద్వారా రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ పంటలకు బీమా వర్తించేది గ్రామాల వారీగా వివరాలిచ్చింది. పరిహారం చెల్లించింది. 2021 జూన్‌లో జీవో నెం 35 విడుదల చేసింది. 540 పేజీలు ఉన్న ఆ జీవోలో ఏ జిల్లాలో ఏ పంటకు బీమా వర్తించేది మండలాల వారీగా, గ్రామాల వారీగా, పంటలవారీగా ప్రకటించింది. మన రాష్ట్రంలో మిరప పంట గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా జిల్లాలు ప్రధానం. ఈ జిల్లాలలో మిరప పంటను బీమా నుంచి మినహాయించింది. ఇక్కడే 75 శాతం పంట ఉంటుంది. నవంబరు నుండి మిర్చి పంటకు తామర వైరస్‌ సోకి పంట మాడిపోతున్న విషయం తెలిసిందే. కేంద్ర పంటల బీమా పథకం ప్రకారం పంట మధ్యకాలంలో నష్టం వాటిల్లితే బీమా మొత్తంలో 25 శాతం వెంటనే చెల్లించాలని షరతు ఉంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ క్లాజు అమలు పరచాల్సి ఉంది. అయినా ప్రభుత్వం ఇప్పటి వరకూ పంటల బీమా పథకం విషయం మాట్లాడడం లేదు. మంత్రుల ప్రకటనలలో ఆదుకుంటామని మాత్రమే చేప్తున్నారు.
 

                                                                     పంట నష్టపరిహారం

ఎకరాకు లక్ష రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టిన రైతుకు ఎకరాకు రూ.6000 ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తే తీరేది కాదు. కేంద్రప్రభుత్వం భూపేంద్రసింగ్‌ హుడా అధ్యక్షతన కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్‌ పంట నష్టపరిహారాలకుగానూ ఆనాటి ధరల పట్టిక ప్రకారం ఆహార పంటలకు ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని 2010లో సూచించింది. ఇప్పటికి 12 సంవత్సరాలు గడిచింది. ఈ కాలంలో వ్యవసాయ పెట్టుబడులన్నీ అనేక రెట్లకు పైగా పెరిగాయి. అయినప్పటికీ ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎకరాకు రూ.6000 గానే ఉంది (కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీ కేవలం ఎకరాకు రూ.2250 గానే ఉంది). రాష్ట్ర ప్రభుత్వం రూ.6000 ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి సరిపెట్టాలని చూడడం సరైంది కాదు. వైఎస్‌ఆర్‌ పంటల బీమా చట్టం ప్రకారం మొత్తం బీమా పరిహారం చెల్లించాల్సి ఉంది. మిర్చి పంట 7 రాష్ట్రాలకు విస్తరించి ఉంది. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే రూ. 6 వేల కోట్లు పైగా పెట్టుబడులు తుడిచిపెట్టుకు పోయాయి. మొత్తం 7 రాష్ట్రాలలో మిర్చి పంట నాశనమైంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ పంటల బీమా కంపెనీ తమకు సంబంధం లేదనే వైఖరిలో ఉండడం సరైంది కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ రైంతాంగానికి సంపూర్ణ పంట బీమా పరిహారం చెల్లించాల్సి ఉంది. లేదా అందుకు సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి.
     రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడడం సమస్యకు పరిష్కారం కాదు. పోరాడితే సాధించవచ్చని గత ఏడాది పాటు జరిగిన రైతు ఉద్యమ అనుభవం మన ముందు ఉన్నది. అందువలన రైతాంగం పూర్తి పంటల బీమా పరిహారం సాధించేవరకూ పోరాడాల్సి ఉంది.

/ వ్యాసకర్త : ఎ.పి రైతు సంఘం అధ్యక్షుడు /
వై. కేశవరావు

వై. కేశవరావు