Jun 29,2023 20:11

రైతుభరోసా కేంద్రం

ప్రజాశక్తి - హోళగుంద
గతేడాది అధిక వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు బీమా పరిహారమందుతుందా లేదా అని రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పష్టతా ఇవ్వడం లేదు. గతేడాది అధిక వర్షాల వల్ల పత్తి, మిరప, వేరుశనగ, వరి, కంది తదితర పంటలు పూర్తిగా నష్టాలనే మిగిల్చాయి. ప్రతేడాది అతివృష్టి, అనావృష్టి వల్ల నష్టపోయిన రైతులను గుర్తించి పంటల బీమా పరిహారం అందజేయాల్సి ఉంది.
గతేడాది ఖరీఫ్‌ సీజన్‌లో 1,538 హెక్టార్లలో పత్తి, మిరప, వేరుశనగ, వరి, కంది పంటలను రైతులు సాగు చేశారు. అలాగే రబీ సీజన్‌లో 3,016 హెక్టార్లలో జొన్న, కొర్రలు, శనగ, వరి తదితర పంటలు సాగు చేశారు. ఖరీఫ్‌, రబీ సీజన్‌ రెండు కలిపి 18,354 హెక్టార్లలో సాగు జరిగింది. దాదాపు 12,832 మంది రైతులు ఉన్నారు. ప్రతి రైతుకూ పంటల బీమాను ఇన్స్యూరెన్స్‌ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. గతేడాది పంటల బీమా పరిహారం పైకం జూన్‌లో తమ ఖాతాలో జమ అయినట్లు రైతులు పేర్కొంటున్నారు.
పంట బీమా పరిహారంపై లేని స్పష్టత
గతేడాది పంట బీమా పరిహారంపై స్పష్టమైన సమాచారం తమ దగ్గర లేదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఏ పంటకు ఎంత బీమా చెల్లిస్తారు, పంట బీమా జాబితా కూడా తమ దగ్గర లేదని చెబుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో అడిగిన డేటాను సీజన్‌ పూర్తి కాగానే ప్రభుత్వానికి చేరవేస్తామని పేర్కొంటున్నారు. రబీ సీజన్‌ పూర్తి కాగానే పంట వివరాలు, పంట బీమా నమోదును ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేస్తామంటున్నారు.
పంట బీమా పరిహారం చెల్లించి ఆదుకోవాలి
ప్రభుత్వం ఇన్స్యూరెన్స్‌ కంపెనీలతో చర్చించి వెంటనే ప్రతి రైతుకూ బీమా పరిహారమందేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఏ సీజన్‌లో నష్టపోయిన రైతులకు, సీజన్‌ పూర్తి కాగానే పంట నష్టపరిహారంతో పాటు బీమా పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి హామీఇచ్చారు. ఆచరణలో ఎక్కడా కనబడడం లేదు. గతేడాది జూన్‌లోనే పంట బీమా పరిహారం ప్రతి రైతుకూ అందిందని, ఈఏడాది వర్షాలు లేక విత్తిన విత్తనాలు ఎండ దెబ్బకు ఎండిపోయాయని రైతులు పేర్కొంటున్నారు. జూన్‌ నెల ముగియడానికి వస్తున్నా మంచి వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంట బీమా పరిహారమందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
బీమా పరిహారం జాబితా రాలేదు
- ఎఒ ఆనంద్‌

మా కార్యాలయానికి ఇంతవరకు పంట బీమా జాబితా రాలేదు. ఈఏడాది పంట బీమా పరిహారం జాబితాలో మండలం ఉందా లేదా అనే విషయం పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. జులై 8న పంట బీమా పరిహారంపై పూర్తి సమాచారం అందే అవకాశం ఉంది.
ఇన్స్యూరెన్స్‌ లేదు.. వర్షాల్లేవు
- పాల్తూరు గోవిందు, రైతు, హోళగుంద

గతేడాది అధిక వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు ఇన్స్యూరెన్స్‌ డబ్బులు ఇంతవరకు అందలేదు. ప్రస్తుతం వర్షాల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇన్స్యూరెన్స్‌ డబ్బులు అందించి ఆదుకోవాలి.