Mar 26,2023 00:28

అభివాదం చేస్తున్న జెఎసి నాయకులు

ప్రజాశక్తి -సీలేరు
జికె.వీధి మండలం సీలేరు పార్వతినగర్‌ వద్ద ఎపి జెన్‌కో నిర్మించబోయే పంపు స్టోరేజ్‌ ప్రాజెక్టులో ఉద్యోగ, ఉపాధికి సంబంధించి స్థానికులకు 100 శాతం మొదటి ప్రాధాన్యత కల్పించాలని ఆ గ్రామ ప్రజలు తీర్మానం చేశారు. పంపు స్టోరేజ్‌ ప్రాజెక్టు నిర్మాణంపై ఏప్రిల్‌ 1న సీలేరులో ప్రజాభిప్రాయ సేకరణ జరపడానికి జెన్కో ఉన్నత అధికారులు నిర్ణయించి, పంచాయతీకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో శనివారం సీలేరు పంచాయతీ కార్యాలయం వద్ద ఇన్‌ఛార్జి సర్పంచ్‌ కె.వల్లిప్రసాద్‌ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ పంపు స్టోరేజ్‌ ప్రాజెక్టు వల్ల స్థానికులకు, చుట్టుపక్కల గ్రామాలకు కలిగే నష్టాలపైనా, ప్రజాభిప్రాయ సేకరణలో అధికారులకు సమర్పించవలసిన ప్రధాన డిమాండ్లపైనా చర్చించారు. స్థానికులకు 100 శాతం ఉపాధి కల్పించడంతో పాటు విద్య, వైద్యం, మంచినీరు, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించాలని, పూర్వం నుండి నేటి వరకు తాత్కాలికంగా నిర్మించుకున్న ఇళ్లను శాశ్వత భవనాలుగా నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని, గ్రామస్తులకు ఇల్లుస్థలాలు కేటాయించాలని, ప్రాజెక్టు వల్ల ఏ విధమైన కాలుష్యంగాని, వాహనాలు రాకపోకలు సాగించేటప్పుడు ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, నిర్వాసితులకు భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు, షాపుకు షాపు ఇచ్చి ఆదుకోవాలని తదితర డిమాండ్లను రూపొందించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి సర్పంచ్‌ వల్లి ప్రసాద్‌ ఎంపీటీసీ పిల్ల సాంబమూర్తి మాట్లాడుతూ ప్రాజెక్ట్‌ నిర్వహణలో ప్రజలకు అన్యాయం జరిగితే పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇటీవల జెన్కో హైడల్‌ డైరెక్టర్‌ సీలేరు పర్యటనకు వచ్చినప్పుడు గ్రామ పెద్దలతో సమావేశమై ప్రాజెక్టు ఏర్పడడం వల్ల వ్యాపారులు పెరుగుతాయని, ప్రజలకు ఎటువంటి నష్టం కలగదని వారు చెప్పారని వెల్లడించారు. స్థానిక నాయకుడు సదరం మారిబాబు మాట్లాడుతూ సీలేరులో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం ప్రధాన డిమాండ్‌గా చేర్చాలని కోరారు. అనంతరం అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఎస్‌టి, ఎస్‌సి అసోసియేషన్‌ నుంచి ఇద్దరేసి చొప్పున జేఏసీగా ఏర్పడి ఏకగ్రీవంగా గ్రామసభలో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు కారే శ్రీనివాస్‌, ఎం.సత్తిబాబు వి.అప్పారావు, నక్క తిరుమలరావు, బొర్రా కృష్ణ, స్వర్ణలత, అంబికా వెంకట్రావు, నక్క జ్ఞానేశ్వర్‌రావు పాల్గొన్నారు.