ఎపి జెన్‌కో విద్యుత్ సౌద చీఫ్ ఇంజినీర్ శేషారెడ్డి
ప్రజాశక్తి -సీలేరు
సీలేరుకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని పార్వతి నగర్ వద్ద 1350 మెగావాట్ల సామర్థ్యం గల పంపు స్టోరేజ్ ప్రాజెక్టు (ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు) ప్రతిపాదించగా, దీని సంబంధించిన అనుమతులు 90శాతం పూర్తయినట్లు ఎపి జెన్‌కో విద్యుత్ సౌద చీఫ్ ఇంజినీర్ (సివిల్) శేషారెడ్డి వెల్లడించారు. స్థానిక విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుకు అవసరమైన స్థలానికి సంబంధించి ప్రజా అభిప్రాయ సేకరణ పూర్తయిందని, పర్యావరణ అనుమతులు రావలసిందని, వచ్చిన వెంటనే ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని పోల్లూరు జల విద్యుత్ కేంద్రానికి సంబంధించిన 5, 6 యూనిట్లు నూతనంగా నెలకొల్పడానికి సంబంధించి విస్తరణ పనులకు ప్రజా అభిప్రాయ సేకరణ పూర్తయిందని, పర్యావరణ అనుమతులు కోసం ఆడిట్ నివేదికలు ఇవ్వవలసిందని చెప్పారు అలాగే ఐదు, ఆరు యూనిట్లు సంబంధించిన విస్తరణ గ్రౌండ్ లెవెల్ పనులు పూర్తయ్యాయని, యంత్ర సామాగ్రి తరలించే పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ పనులు పర్యవేక్షణ నిమిత్తం వచ్చే అధికారుల కోసం కార్యాలయాలు క్వార్టర్స్ సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సీలేరు కాంప్లెక్స్ ఎస్‌ఈ సివిల్ కెకె.ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.
డొంకరాయి జలాశయం నుంచి రబీకి నీరు విడుదల
సీలేరు కాంప్లెక్స్ పరిధి డొంకరాయి జలాశయం నుంచి గోదావరి డెల్టా రబీ పంటకు 2700 క్యూసెక్కులు నీటిని మంగళవారం నుంచి విడుదల చేస్తున్నట్లు ఏపీ జెన్కో విద్యుత్ సౌదా చీఫ్ ఇంజనీర్ శేషారెడ్డి వెల్లడించారు. ఇరిగేషన్ అధికారులు గోదావరి డెల్టా వరి నాట్లకు నీటిని విడుదల చేయాలని కోరడంతో ఈ మేరకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం గోదావరి డెల్టాకు సీలేరు కాంప్లెక్స్ నుంచి విద్యుత్ ఉత్పత్తి అనంతరం 4 వేలు క్యూసెక్కులు, డొంకరాయి జలాశయం నుంచి 2700 క్యూసెక్కులు విడుదల చేసేవారుమని పేర్కొన్నారు. ప్రస్తుతం పవర్ కెనాల్ గండి కారణంగా కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం లేకపోవడంతో గోదావరి డెల్టాకు నీరు అత్యంత అవసరం ఉండడంతో నేరుగా డొంకరాయి జలాశయం గేట్లు ద్వారా నీటిని విడుదల చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. డొంకరాయి జలాశయం గేట్లు ద్వారా 2000 క్యూసెక్కులు ఏవీపీ డ్యాం ద్వారా 700 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఈనెల 29 వరకు నీటి విడుదల చేస్తామన్నారు.
శరవేగంగా డొంకరాయి పవర్ కెనాల్ పనులు
డొంకరాయి పవర్ కెనాల్ గండి పూడ్చివేత పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది జనవరి 5 నాటికి పనులు చేస్తామని శేషారెడ్డి తెలిపారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఇంజనీర్లు పర్యవేక్షణలో జరుగుతున్నాయన్నారు. కెనాల్ మరమ్మతు పనులు కోసం కోటి 70 లక్షల రూపాయలు వరకు అంచనా తయారు చేశామన్నారు.










