ప్రజాశక్తి -అనంతగిరి :కర్ర పొయ్యిలతో వంట చేస్తూ, పొగ, కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు పంపిణీ కోసం క్రాప్‌జోన్ ఎగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రమోటాన్ సంస్థ సహకారంతో నూతన టెక్నాలజీతో తయారుచేసిన బయోటెక్ స్టవ్‌లు మండల కేంద్రంలోని సామాజిక భవనంలో సిద్ధంగా ఉన్నాయి. బ్రిటన్(లండన్)కు చెందిన సంస్థ ట్రమోటాన్ కొత్త ఆలోచననలతో ఈ పొయ్యిని రూపొందించారు. మూడు అడుగుల పొడుగున్న నాలుగు కర్ర ముక్కలతో దాదాపు గంటన్నర సేపు ఈ పొయ్యిపై వంట వండేందుకు వీలుంటుందన్నారు. అధిక ఉష్ణోగ్రత వెలువడడడంతో వంట కూడా త్వరగా అయిపోతుందని, అంతేకాక 80శాతానికి పైగా పొగ కాలుష్యం లేకుండా పనిచేస్తుందన్నారు.ఈ పొయ్యిలో పెట్టే కర్రలకు నిప్పు పెట్టడానికి కిరోసిన్, ఇతరత్రా ఇంధనం అవసరం ఉండదన్నారు. మండుతున్న పొయ్యిని కదపకుండా వంట చేయాల్సి ఉంటుందన్నారు. పొయ్యి లోపల ఉన్న సిరానిప్ అనే పరికరాన్ని మాత్రం మార్చాల్సి ఉంటుందన్నారు.
స్థానిక మండలంలోని గిరిజనులకు పంపిణికీ 6,400 బయోటెక్ స్టవ్‌లు సామాజిక భవనంలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఒక్కో పొయ్యి విలువ రూ.3,100 అయినప్పటికీ, లబ్ధిదారుని నుంచి కేవలం రవాణా ఛార్జీలు రూ.250 మాత్రమే వసూలు చేస్తామని సంస్థ మండల కోఆర్డినేటర్ ఎస్.బురిడి దశరథ్ తెలిపారు. ఆధార్, రేషన్ కార్డు జిరాక్సులతో వచ్చి బయోటెక్ పొయ్యిని పొందవచ్చని సూచించారు.










