Jan 17,2022 15:18

చంఢీగర్  :  పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ మారింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 20 తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్‌ (ఇసి) సోమవారం ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం పంజాబ్‌లో ఫిబ్రవరి 14న పోలింగ్‌ జరగాల్సి వుంది.  ఫిబ్రవరి 16న గురు రవిదాస్‌ జయంతి సందర్భంగా ఎన్నికల తేదీని మార్చాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలు కోరాయని ఇసి తెలిపింది. ఇదే అంశంపై ఇటీవల పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్ని ఇసికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 16న గురు రవిదాస్‌ జయంతి సందర్భంగా ఎస్‌సి కమ్యూనిటీకి చెందిన అధిక శాతం మంది ఫిబ్రవరి 10 నుండి 16వ తేదీ వరకు యుపిలోని వారణాసి సందర్శనకు వెళతారని.. దీంతో ఎక్కువ శాతం మంది పోలింగ్‌లో పాల్గొనలేకపోవచ్చని అన్నారు. రాష్ట్ర జనాభాలో 32 శాతం ఎస్‌సి కమ్యూనిటీ ప్రాతినిథ్యం వహిస్తున్నందున పోలింగ్‌ను కనీసం ఆరురోజులకి వాయిదా వేయాల్సిందిగా కోరుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.