పంజాబ్‌కు క్యూ కట్టనున్న ప్రధాని, బిజెపి నేతలు... రైతుల నుండి ఎదురుకానున్న నిరసన సెగ
జలంధర్ : ఉత్తరప్రదేశ్‌లోని అఖింపూర్ ఖేరీలో హింసాత్మక ఘటనలో అరెస్టైన కేంద్ర సహాయక మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో పంజాబ్‌ల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్న ప్రధాని మోడీ, ఇతర బిజెపి నేతలకు... వీరి నుండి నిరసన సెగ ఎదురుకానుంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో అన్నదాతలు చేపట్టిన ఉద్యమాన్ని ఈ ఎస్‌కెఎం నేతృత్వం వహించిన సంగతి తెలిసిందే. ఉద్యమంతో వెనక్కు తగ్గిన కేంద్రం .. ఈ చట్టాలను రద్దు చేసింది.
ఈ నెల 14న ప్రధాని జలంధర్ పర్యటనను వ్యతిరేకిస్తూ .. ఆందోళనలు చేపడతామని ఎస్‌కెఎం ఇప్పటికే ప్రకటించింది. ఫిబ్రవరి 16న పఠాన్ కోట్, 18న అబోర్‌లో మోడీ పర్యటనకు నిరసనగా శాంతియుత ఆందోళనలు చేపడతామని ఎస్‌కెఎం నేతలు తెలిపారు. ఈ నెల 20న పంజాబ్ ఎన్నికలు జరుగుతుండగా.. ప్రచారంలో భాగంగా మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖతర్, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా.. సహా ఇతర బిజెపి నేతలు రానున్నారు. వారు రాష్ట్రానికి వచ్చే సమయంలో నల్ల జెండాలు ప్రదర్శించి.. నిరసనలు తెలుపుతామని పేర్కొన్నారు.










