న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార కర్తల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో సీనియర్ నేతలు బాహాటంగానే విమర్శలకు దిగారు. గురువారం కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌ల జాబితాను విడుదల చేసింది. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతల పేర్లతో విడుదల చేసిన ఈ జాబితాలో పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకే ఒక హిందూ ఎంపి మనీష్ తివారీ, గులాం నబీ ఆజాద్‌ల పేర్లు లేవు. దీంతో ఈ జాబితాపై మనీష్ తివారీ మండిపడ్డారు. ఈ జాబితాలో తన పేరు ఉండి ఉంటే ఆశ్చర్యానికి గురయ్యేవాడినని వ్యంగ్యంగా పేర్కొన్నారు. దీనివెనుక రహస్యమేమీ లేదని, కారణాలు అందరికీ తెలుసునని ట్వీట్ చేశారు. ఈ జాబితాపై ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, మాజీ కాంగ్రెస్ ఎంపి అభిజిత్ ముఖర్జీ కూడా స్పందించారు. పంజాబ్ కాంగ్రెస్‌లో విచారకరమైన పరిస్థితి నెలకొందని, సీనియర్ నేత, పంజాబ్ ఎంపి, మాజీ మంత్రి అయిన మనీష్ తివారీని ప్రచారకుల జాబితా నుండి మినహాయించారని.. ఇలాంటి సంకుచిత చర్యలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేందుకు సహాయపడవని అన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ తొలి దశ పోలింగ్ కోసం విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్స్‌లో గులాం నబీ ఆజాద్ పేరును చేర్చారు. ఆ తర్వాత రోజే ఆయనకు కేంద్రం పద్మ భూషణ్ ప్రకటించింది. అవార్డు ప్రకటించిన తర్వాత విడుదల చేసిన తొలి జాబితా అయిన పంజాబ్ స్టార్ క్యాంపెయినర్స్‌లో మాత్రం ఆయన పేరు కనిపించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీలో పలు సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందంటూ ఇటీవల పలువురు సీనియర్ నేతలు సోనియాగాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. జి-23 నేతలుగా పిలుస్తున్న ఈ నేతల్లో తివారీ, ఆజాద్‌లు ఉన్నారు. దీంతో లేఖ కారణంగానే కాంగ్రెస్ అధిష్టానం ఈ నేతలను పక్కన పెట్టినట్లు భావిస్తున్నారు. అయితే ఇదే జాబితాలో ఉన్న ఆనంద్‌శర్మ, భూపిందర్ హుడాలకు ప్రచారకుల జాబితాలో చోటు దక్కడం గమనార్హం.










