పంజాబ్ సిఎం సోదరుడికి కాంగ్రెస్ టికెట్ నిరాకరణ.. స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి
చండీఘర్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం కాంగ్రెస్ విడుదల చేసిన తొలి జాబితాపౖౖె పార్టీ శ్రేణులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా మాన్సా, మోగా, మాలౌట్, బస్సీ పఠానా నియోజకవర్గాల్లో నేతలు గుర్రుగా ఉన్నారు. ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ సోదరుడు మనోహర్ సింగ్‌కు సైతం టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. బస్సీ పఠానా నుండి పోటీ చేసేందుకు .. ఖరార్ సివిల్ ఆసుపత్రిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మనోహర్.. ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తనకు లభిస్తుందనుకున్న స్థానాన్ని.. సిట్టింగ్ ఎమెల్యే గుర్‌ప్రీత్ సింగ్ జిపికి ఇవ్వడంతో.. మనోహర్ అసంతృప్తితో ఉన్నారు. దీంతో స్వతంత్య్రంగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. చరణ్‌జీత్ సింగ్ చన్నీ చమ్‌కౌర్ షాహిబ్, పిసిసి అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్దు తూర్పు అమృత్‌సర్ నియోజక వర్గం నుండి బరిలోకి దిగుతున్నారు.
ఇక మౌలాట్, మోగాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అజైబ్ సింగ్, హర్జోత్ కమల్‌కు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. అదేవిధంగా కొంత కాలం క్రితం కాంగ్రెస్ గూటికి చేరిన వివాదాస్పద పంజాబీ గాయకుడు సిద్దు ముస్సేవాలాకు మాన్సా టికెట్ ఇవ్వగా.. నటుడు సోనూసూద్ సోదరి మాళవికకు మోగా టికెట్‌ను కేటాయించింది. 2019లో ఆప్ నుండి వైదొలిగి.. కాంగ్రెస్‌లో చేరిన నాజర్ సింగ్ మాన్హహియా స్థానంలో సిద్దును ఎంపిక చేసింది. ఆప్ నుండి కాంగ్రెస్‌లోకి జంప్ చేసిన రూపేందర్ కౌర్ రూబే.. మాలౌట్ ఎస్‌సి స్థానం నుండి పోటీకి దిగనుంది. గత ఎన్నికల్లో ఆమె ఆప్ నుండి బతిండ రూరల్ నుండి పోటీ చేశారు.










