Feb 07,2022 09:03

న్యూఢిల్లీ : పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ పేరునే కాంగ్రెస్‌ అధిష్టానం ఖరారు చేసింది. అయితే ఈ పదవి కోసం పోటీ పడుతున్న పిసిసి అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్దును కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ఎలా బుజ్జగించారో సందిగ్దత నెలకొంది. కాగా, రాహుల్‌ ఏ నిర్ణయం తీసుకున్నా.. అందరం కట్టుబడే ఉంటామని సిద్ధూ .. ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటనకు ముందు తెలిపారు. రాహుల్‌ నిర్ణయం ముందే తెలిసి.. చేసేదేమీ లేక ఇలా కట్టుబడి ఉన్నారన్న అనుమానాలు లేకపోలేదు. అయితే లూథియానాలో పార్టీ సిఎం అభ్యర్థి ప్రకటన ముందు రాహుల్‌ వ్యాఖ్యానించిన ఆసక్తికర విషయాలు చూస్తే.. సిద్ధు కన్విన్స్‌ అవ్వకడానికి అవకాశమే లేదని అర్థమౌతుంది.
రాహుల్‌ మాట్లాడుతూ... రాజకీయ నేతలు 10-15 రోజుల్లో పుట్టరని, టెలివిజన్‌ చర్చల్లో పాల్గనడం ద్వారా నేతలు తయారవ్వరని అన్నారు. ఈ సిఎం అభ్యర్థి నిర్ణయం తనది కాదని, పంజాబ్‌ ప్రజలు, యువత, కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తనకంటూ ఓ అభిప్రాయం ఉందని, కానీ తన కన్నా.. వారి అభిప్రాయం ఎంతో ప్రాముఖ్యమైందని అన్నారు. పేదల్ని అర్థం చేసుకునే సిఎం కావాలని పంజాబ్‌ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. నాయకులను అభివృద్ధి చేసే వ్యవస్థ ఉందని చెబుతూ... సిద్ధును సోదాహరణంగా ప్రస్తావించారు. '2004 నుండి రాజకీయాల్లో ఉన్నాను. రాజకీయం అంటే సులువైన పని అనుకుంటే... వారి తప్పే. చాలా మంది చక్కగా వాక్చాత్యురంతో ఉంటారు. అయితే... నేతలను తయారు చేయడం సులభమేమీ కాదు' అని అన్నారు. చన్ని పేదల పుత్రుడని, పేదరికం గురించి ఆయనకు తెలుసునని, ఆయలో అహంకారం లేదని, ప్రజలను వెళ్లి కలుస్తారని, ఆయన పేదల గొంతు అంటూ వర్ణించారు.