
ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్ కొవ్వూరు మున్సిపాలిటీలో సేకరించిన చెత్తను మండలంలోని ఐ.పంగిడి గ్రామంలో వేసేందుకు పోలీసు బందోబస్తు మధ్య అధికారులు ప్రయత్నిం చారు. తమ గ్రామాన్ని డంపింగ్ యార్డు గా మార్చడానికి వీల్లేదంటూ పంగిడి గ్రామ ప్రజలు చెత్తతో వచ్చిన లారీలను అడ్డుకున్నారు. దీంతో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. కొవ్వూరు పట్టణంలో సేకరించిన చెత్తను డంపింగ్ చేసేందుకు పంగిడి గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని అధికారులు గుర్తించారు. చెత్తను వేసేందుకు గతంలో ప్రయత్నించడంతో గ్రామస్తులంతా తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆ ప్రక్రియను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇదే అంశాన్ని హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత దృష్టికి ప్రజలు తీసుకెళ్లారు. చెత్తను గ్రామంలో వేయనీయమని మంత్రి హామీ ఇచ్చారు. అయితే బుధవారం ఉదయం చెత్తతో నిండిన లారీలను పోలీసు బందోబస్తు మధ్య పంగిడి తీసుకెళ్లడంతో గ్రామ ఉపసర్పంచ్ ఉప్పులూరి నానాజీ, టిడిపి నాయకులు పొట్రు సిద్దు సంయుక్తంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో చెత్తతో వెళ్లిన లారీలను అడ్డుకొని ఆందోళనకు దిగారు. దీంతో చెత్తను డంప్ చేసే ప్రక్రయ నిలిచిపోయింది. గ్రామ ప్రజలకు ఇబ్బందులు తెచ్చేలా అధికారులు వ్యవహరించడం సరికాదని, ఈ చర్యను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, అవసరమైతే వైసిపికి రాజీనామా చేసైనా పోరాటాన్ని సాగిస్తానని గ్రామ ఉప సర్పంచ్ నానాజీ హెచ్చరించారు. జగనన్న కాలనీ కోసం లక్షల రూపాయలు వెచ్చించి స్థలాలు కొనుగోలు చేసిన ప్రభుత్వం కొవ్వూరు మున్సిపాలిటీలో చెత్తను వేయడానికి స్థలాన్ని కొనుగోలు చేయకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నించారు.