Oct 24,2023 21:36

భూ స్వాధీన స్థలం వద్ద సహపంక్తి భోజనాలు పేదలు

        చిలమత్తూరు : ఇళ్ల పట్టాల కోసం చిలమత్తూరులో పేదలు చేస్తున్న భూ పోరాటం నిర్విరామంగా కొనసాగుతోంది. పండుగ రోజు కూడా ఆందోళనను ఆపకుండా భూ స్వాధీన స్థలంలోనే నిరసన చేపట్టారు. ఓ వైపు పండుగ, మరోవైపు పోరాటాన్ని కలిపి ఆందోళన నిర్వహించారు. భిన్నత్వంలో ఏకత్వం ఉట్టిపడేలా హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు దసరా పండగును వారు గుడిసెలు వేసుకున్న స్థలంలోనే సోమవారం జరుపుకున్నారు. అక్కడే వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. చిన్నారులతో కలిసి ఆటపాటలు, నృత్యాలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ఇళ్ల స్థలాల కోసం కోడూరు పొలం సర్వేనెంబర్‌ 805లో గత 40 రోజులుగా పేదలు భూస్వాధీన పోరాటం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పోరాటాన్ని కొనసాగిస్తూ జగనన్న లేఅవుట్‌లో వేసుకున్న గుడిసెల్లోనే పేదలు దసరా పండుగ సంబరాలు చేసుకున్నారు. గుడిసెల ముందు ముగ్గులు వేసి తోరనాలు కట్టారు. తొలుత లేఅవుట్‌లో సిపిఎం జెండాను ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలమత్తూరులో ఇళ్ల స్థలాల కోసం పేదలు చేస్తున్న పోరాటం జిల్లాకే ఆదర్శం అన్నారు. విజయదశమి అంటే రాక్షసులపై ప్రజల విజయమని, అలాంటి రోజున పోరాట స్ఫూర్తితో ఎర్రజెండాను ఎగరవేయడం అభినందనీయం అన్నారు. పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చే వరుకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
భిన్నత్వంలో ఏకత్వం ఉట్టిపడేలా వనభోజనాలు
భారతీయ సంస్కతి సంపద్రాయం భిన్నత్వంలో ఏకత్వం ఉట్టిపడేలా హిందూ ముస్లిం సోదరలు కులమతాలకు అతీతంగా అందరూ కలిసి భూస్వాధీన స్థలంలోనే వంటకాలు చేసుకుని, సహపంత్తి భోజనాలు చేశారు. న్యాయమైన పోరాటానికి కులమతాలు అడ్డురావని, అందరూ ఐక్యం ఉంటే ఎలాంటి లక్ష్యాన్ని సాధించవచ్చేని సంకేతాన్ని వారు అందించారు. పేదలు చేస్తున్న ఈ పోరాటం చాలా మందిని కదలించింది. మండలంలోనే పలు గ్రామాల ప్రజలు వారి వద్దకొచ్చి మద్దతు తెలిపారు. ఇక చిన్నారులు చేసిన నృత్యాలు అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సమిష్టిజీవనం... సమిష్టి కషితో ఇళ్ల పట్టాలు సాధిస్తాం
ఇళ్ల స్థలాల సాధన కమిటీ కార్యదర్శి చందు

సిమిష్టి జీవనం.. సమిష్టి కృషితో ఇళ్ల పట్టాలను సాధించేలా పోరాటం కొనసాగిస్తామని ఇళ్ల స్థలాల సాధన సమితి కార్యదర్శి చందు తెలిపారు. 805 సర్వే నెంబర్‌లో గుడిసెలు వేసుకున్న పేదలందరూ కష్టజీవులన్నారు. గుడిసెల కేంద్రంలో పండుగ వాతావరణం ఒట్టిపడేలా ఐక్యమత్యంగా పోరాటం సాగిస్తున్నామని చెప్పారు. ఈ వేడుకల ద్వారా తమ పోరాట స్ఫూర్తిని ప్రభుత్వం, అధికారులకు తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యకాసం జిల్లా కార్యదర్శి పెద్దన్న, అధ్యక్షుడు ఫిరంగి ప్రవీణ్‌ కుమార్‌, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఎంవి.రమణ, సిపిఎం మండల కార్యదర్శి వెంకటేష్‌, అధ్యక్షుడు లక్ష్మినారాయణ, చందు, సదాశివరెడ్డి, రహంతుల్లా, రియాజ్‌, వేణు, మణి, శివ తదితరులు పాల్గొన్నారు.