Oct 10,2021 13:19

పండుగ అనగానే పులిహోర, పాయసం, మినప గారెలు వంటి పిండి వంటలతో పసందుగా ఉంటుంది. వీటికి కాస్త భిన్నంగా ఈసారి పండుగకు పిల్లలకు, పెద్దలకు నోరూరించే పన్నీర్‌ పాయసం, రవ్వ బొబ్బట్లు, బొంబాయి కరాచీ హల్వా, సగ్గుబియ్యం గారెలు, వెజిటబుల్‌ వడలు ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..


                                                          బొంబాయి కరాచీ హల్వా

పండుగ పసందుగా..!

కావాల్సిన పదార్థాలు : కార్న్‌ఫ్లోర్‌-కప్పు, పంచదార-కప్పు, నెయ్యి-1/4 కప్పు, నీరు-3 కప్పులు, మిఠాయి రంగు-1/4 చెంచా, సార పలుకులు- పావు కప్పు, జీడీపప్పు తురుము- పావు కప్పు, నిమ్మరసం- చెంచా.
 

తయారుచేసే విధానం : పెద్ద గిన్నె తీసుకుని కార్న్‌ ఫ్లోర్‌ వేసి, కప్పు నీరు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
మరొక కప్పు నీరు వేసి, జారుగా చేసుకోవాలి.
స్టౌపై పాన్‌ పెట్టి, సన్నని మంటపై ఉంచాలి. పంచదార, కప్పు నీరు పోయాలి. కరిగిన తర్వాత పాకం మరుగుతున్నప్పుడు కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమాన్ని వేసి, ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి.
దగ్గర పడగానే నిమ్మరసం వేసి కలపాలి. నిమ్మరసం వల్ల పారదర్శకంగా అవుతుంది.
ఇప్పుడు నచ్చిన మిఠాయి రంగు వేసి, బాగా కలిసేట్టుగా తిప్పాలి.
రెండు స్పూన్ల నెయ్యి వేసి, కలుపుకుని బాగా ఉడకనివ్వాలి.
మిగిలిన నెయ్యి మొత్తం వేసి కలపాలి.
చివరగా సార పలుకులు, జీడిపప్పు తురుము వేసి, కలుపుకోవాలి.
కొద్దిసేపు తర్వాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ట్రేలో వేసి, సమానంగా పరుచుకోవాలి.
పావు గంట చల్లారాక, ముక్కలుగా కోసుకోవాలి. అంతే రుచికరమైన బాంబే కరాచీ హల్వా సిద్ధం.

                                                                    పన్నీర్‌ పాయసం

పండుగ పసందుగా..!

కావాల్సిన పదార్థాలు : తరిగిన పన్నీర్‌-అరకప్పు, బెల్లం తురుము-2 కప్పులు, చిక్కటిపాలు-ముప్పావు కప్పు, పాలు-అర లీటరు, డ్రై ఫ్రూట్స్‌-తగినన్ని, యాలకుల పొడి- టీ స్పూను.


తయారుచేసే విధానం : స్టౌపై మందపాటి గిన్నె ఉంచి వేడయ్యాక, తరిగిన పన్నీర్‌, పాలను ఒకదాని తర్వాత ఒకటి వేయాలి.
పది నిమిషాల వరకూ ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. దీనికి చిక్కటి పాలను జతచేసి, మరో నాలుగు నిమిషాలు కలపాలి.
బెల్లం తరుగు, యాలకుల పొడి జతచేసి, బెల్లం కరిగే వరకూ బాగా కలపాలి. డ్రై ఫ్రూట్స్‌ వేసి, బాగా కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.
తరిగిన బాదం, కిస్మిస్‌లతో గార్నిష్‌ చేసి, చల్లారాక సర్వ్‌ చేసుకోవాలి.


                                                                వెజిటబుల్‌ వడ

పండుగ పసందుగా..!

కావాల్సిన పదార్థాలు : బియ్యంపిండి-పావుకేజీ, శనగ పిండి-పావుకేజీ, క్యారెట్‌ తురుము-50గ్రా, పచ్చి బఠానీలు-వంద గ్రా., గరం మసాలా-2 చెంచాలు, కాబేజీ కోరు-50గ్రా., పాలకూర-2 కట్టలు, వంటనూనె-అర లీటరు, ఉప్పు-తగినంత, పచ్చిమిర్చి ముక్కలు-15, బీన్స్‌ ముక్కలు-కప్పు, కరివేపాకు-10 రెబ్బలు, కొత్తిమీర కోరు-అర కప్పు.


తయారుచేసే విధానం : ముందుగా కూరగాయలన్నిటినీ తరిగి, ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పాలకూరను సన్నగా తరగాలి.
ఙ పాలకూర, శనగపిండి, గరంమసాలా పొడి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, ఉడికించిన కూరగాయ ముక్కలు వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి, పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి.
ఙ తరువాత స్టౌపై పాన్‌లో నూనె పోయాలి. నూనె కాగిన తర్వాత పిండి ముద్దలు తీసుకుని, వడల్లా చేసుకుని, బ్రౌన్‌ కలర్‌ వచ్చేంతవరకూ వేయించాలి. వీటిని చట్నీ/ సాస్‌తో గానీ తింటే బాగుంటాయి.


                                                              సాబుదాన గారెలు

పండుగ పసందుగా..!

కావాల్సిన పదార్థాలు : సాబుదానా (సగ్గుబియ్యం)- కప్పు, బంగాళదుంప- ఒకటి (ఉడికించి పొట్టు తీయాలి), పచ్చిమిర్చి-8, ఉప్పు-తగినంత, నూనె- తగినంత.

తయారుచేసే విధానం : ముందుగా సగ్గుబియ్యం కడిగాక, తగినన్ని నీళ్లు పోసి, మూడు గంటలు నాననివ్వాలి.
ఒక పాత్రలో నానిన సగ్గుబియ్యం, ఉడికించిన బంగాళదుంప, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి.
స్టౌపై పాన్‌లో నూనె పోసి, కాగనివ్వాలి.
సగ్గుబియ్యం మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా తీసుకుని, గారెల్లా చేతితో వత్తు కోవాలి.
సన్నని మంటపైనే ఉంచి, గారెలను నెమ్మదిగా బంగారురంగు వచ్చేవరకూ వేయించుకోవాలి.
ప్లేటులో పేపర్‌ నాప్‌కిన్‌ వేసి, దానిపై వేయించిన గారెలను తీసుకోవాలి (టమాటా సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి).