రాయచోటి : జిల్లా ప్రజలందరిలో దేశభక్తి భావాలు రేకెత్తించేలా పంద్రాగస్టు వేడుకలను పెద్దఎత్తున చేపట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వివిధ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ గిరీష ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై సంబందిత జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పాటైన తర్వాత రెండవసారి జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నామన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కనువిందు చేసే రీతిలో నిర్వహించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. దేశభక్తి ఉట్టిపడేలా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో సాంస్క తిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. శకటాలను ఓవరాల్ గా కోపరేటివ్, పరిశ్రమల శాఖ జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. నవరత్నాల అభివద్ధి కార్యక్రమాలు ప్రతిభింబించేలా వ్యవసాయం, డీఆర్‌డీఏ, హౌసింగ్, వైద్యం, డ్వామా, ఐసిడిఎస్, సివిల్ సప్లై, పశుసంవర్ధక, హార్టికల్చర్, పంచాయతీ రాజ్, రీ సర్వే, మున్సిపల్ తదితర అన్ని సంక్షేమ శాఖల అభివద్ధి కార్యక్రమాలపై ఏర్పాట్లు చేసే శకటాల ప్రదర్శన ఆకర్షిణీయంగా, అందరిని ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. ప్రభుత్వ శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా అభివద్ధిపై సందేశ బుక్‌లెట్‌ను సిద్ధం చేయాలని డీఐపీఆర్‌ఓను ఆదేశించారు. స్వాతంత్య్ర సమరయోధులకు, జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికారులకు వేర్వేరుగా ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓకు సూచించారు. అత్యంత ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాల జారీకి జాబితాను సిద్ధం చేయాలని డిఆర్‌ఓ ను ఆదేశించారు. అనంతరం ఎస్పీ గంగాధర్ రావుతో కలిసి పరేడ్ గ్రౌండ్‌ను సందర్శించి వివిధ శాఖల అధికారులకు తగు సూచనలు చేశారు సమీక్షలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ గంగాధర్ రావు, డిఆర్‌ఒ సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.










