దేశ దేశాల్లోని సంపన్నులు, బడాబాబుల అక్రమ పెట్టుబడులు, దొంగ ఆస్తులు, డొల్ల కంపెనీల వ్యవహారాన్ని బట్టబయలు చేసిన పండోరా పేపర్స్ తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసిఐజె) ఆధ్వర్యాన సాగిన ఈ పరిశోధనలో భాగస్వాములైన 117 దేశాల్లోని 150 మీడియా సంస్థలకు చెందిన 600 మంది జర్నలిస్టులు అభినందనీయులు. సుమారు 1.12 కోట్ల పత్రాలను విశ్లేషించి అక్రమార్కుల చిట్టాను పొందుపరిచారు. పన్నులు ఎగ్గొట్టి చట్టవిరుద్ధంగా విదేశాల్లో ఆస్తులు పోగేసిన చీకటి వ్యవహారాలు బయటపడ్డాయి. రిలయన్స్ అడాగ్ యాజమాని అనిల్ అంబానీ, నీరవ్ మోడీ సోదరి పూర్వీ మోడీ, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ వంటి 'ప్రముఖ వ్యక్తుల' విదేశీ ఆస్తుల చిట్టా ఇందులో బయటపడింది. భారతీయ సంపన్నుల దొంగ ఆస్తులే కాకుండా 91 దేశాల్లోని అక్రమార్కుల పేర్లు పండోరా పేపర్స్‌లో చోటు చేసుకున్నాయి. వారిలో 35 మంది దేశాధినేతలు, ప్రధానులు, మాజీలు ఉన్నారు. మరో 336 మంది అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు, మాజీలు, క్రీడాకారులు, వ్యాపార దిగ్గజాలు ఉన్నారంటే అవినీతి ఎంత విశృంఖలంగా సాగుతుందో బోధపడుతుంది. భారత్‌లో మొత్తం 380 మంది వరకూ పండోరా పేపర్స్‌లో ఉండటం ఆందోళనకరం. ఈ నల్ల కుబేరులంతా తాము అక్రమంగా ఆర్జించిన సొమ్మును పన్నుల స్వర్గధామంగా చెప్పే దేశాల్లో అత్యంత సంక్లిష్టమైన ట్రస్టులు, కంపెనీల్లో దాచుకుంటున్నారు. ఈ జాబితా లోని పలువురు బిలియనీర్లు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 29 వేల డొల్ల కంపెనీలు, ట్రస్టుల్లో అక్రమ పెట్టుబడులు పెట్టారని తేలింది. ఈ దొంగ వ్యవహారాలను నెరవేర్చడానికి ఏ దేశం వారికైనా సేవలందించేందుకు 14 అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు పనిచేస్తున్నాయి.
మార్కెట్ శక్తులే అన్నిటినీ నిర్ణయిస్తాయని, ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్‌గా మాత్రమే ఉండాలి తప్ప వ్యవస్థపై ఎలాంటి నియంత్రణ అధికారాలు దానికి ఉండరాదన్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల మూలంగానే దేశ సంపద అడ్డగోలుగా దోపిడీకి గురవుతోంది. ఫెరా, ఫెమా, ఎంఆర్‌టిపి, సిసిఐ తదితర చట్టాలు, ఎగుమతి దిగుమతులపై ఆంక్షలు, ఎఫ్‌డిఐ, ఎఫ్‌ఐఐ ప్రవేశంపై ఎన్నో నిబంధనలు గతంలో పటిష్టంగా ఉండేవి. దేశంలోకి అక్రమంగా ఒక డాలర్ రావాలన్నా, వెలుపలికి ఒక రూపాయి పోవాలన్నా ఎంతో కష్టంగా ఉండేది. కాని, పెట్టుబడి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించాలంటూ సరళీకరణ పేరిట వాటిన్నిటిని నీరుగార్చారు. పర్యవసానంగా అధికారంలో ఉన్న వారికి ఇబ్బడి ముబ్బడిగా సూట్‌కేసుల్తో ముడుపులు, పన్నులకు స్వర్గధామాలుగా చెప్పబడే దేశాల్లో సూట్‌కేసు కంపెనీలు వర్ధిల్లాయి. ప్రపంచంలోని అత్యధిక దేశాల్లో నయా ఉదారవాద ఆర్థిక విధానాలదే పైచేయిగా ఉండడం వల్ల ఈ ఘరానా దొంగతనాలు పెచ్చరిల్లాయని పండోరా పత్రాలు తేటతెల్లం చేశాయి. ఇలాంటి పన్ను ఎగవేతల మూలంగా ప్రపంచవ్యాప్తంగా 600 బిలియన్ డాలర్లు (45 లక్షల కోట్ల రూపాయలు) ఆయా ప్రభుత్వాలు కోల్పోతున్నాయని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
పండోరా పత్రాలకు సంబంధించిన కేసులను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఆధ్వర్యాన బహుళ ఏజెన్సీల బృందంతో దర్యాప్తు చేయిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఐదేళ్ల క్రితం పనామా పేపర్స్, పారడైజ్ పేపర్స్ వంటి వాటి ద్వారా వెల్లడైన ప్రముఖుల అక్రమ విదేశీ ఆస్తుల చిట్టా సంచలనం సృష్టించింది. అప్పుడూ కేంద్రం సిట్ నియమించడం, విదేశాలకు పోయిన సొమ్మును వెనక్కు తెప్పిస్తానని గంభీర ప్రకటనలు చేయడం అందరికీ తెలిసిందే. ఇంతవరకూ అవేవీ ఆచరణ రూపం దాల్చలేదు. ఇప్పటి పండోరా పత్రాలపై ప్రకటన కూడా అలాంటి ఉత్తర కుమార ప్రగల్భమే కావచ్చు. ఇ.డి, ఐ.టి, ఎన్‌ఐఎ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం మాని, దేశ సంపదను అక్రమంగా తరలించుకుపోతున్న ఈ చీకటి వ్యవహారం వైపు మళ్లించగల చేవ, నిజాయతీ ఈ ప్రభుత్వానికి ఉందా అన్నది ప్రశ్న. నయా ఉదారవాద అభివృద్ధిని స్వాగతించి, బలపర్చిన వారిని పండోరా పత్రాల వాస్తవాలు పునరాలోచింప జేస్తాయనడంలో సందేహం లేదు.










