
ప్రజాశక్తి-పాడేరుటౌన్:ఐటిడిఎలో శుక్రవారం నిర్వహించిన స్పందనకు 75 అర్జీలు వచ్చాయి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జెసి జె.శివ శ్రీనివాసు, ఐటిడిఎ పిఒ వి.అభిషేక్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీవాత్సవతో కలిసి వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఐటిడిఎ పిఒ వి.అభిషేక్ మాట్లాడుతూ, స్పందనలో స్వీకరించిన ఫిర్యాదులకు అధికారులు జవాబుదారిగా వ్యవహరించాలన్నారు. కోర్టు కేసులకు కౌంటర్ దాఖలు చేయాలని సూచించారు. ప్రతీ శుక్రవారం ఐటిడిఎలో నిర్వహించే స్పందనకు శాఖాధికారులు తప్పనిసరిగా ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆదేశించారు. స్పందనకు హాజరుకాని 8 మంది అధికారులకు షోకాజ్ నోటీస్ లు జారీ చేస్తామన్నారు. అత్యవసర పనులుంటే జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోవాలన్నారు. ఐటిడిఎ పరిధిలోని అధికారులు పిఒ అనుమతి తీసుకుని వెళ్లాన్నారు. ముందస్తు అనుమతి లేకుండా స్పందనకు గైర్హాజరయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్పందనలో ఫిర్యాదులు
కొయ్యూరు మండలం కొప్పుకొండ కొత్త వీధికి అంగన్‌వాడీ కేంద్రం మంజూరు చేయాలని గ్రామస్తులు వినతి పత్రం సమర్పించారు. డుంబ్రిగుడ మండలం కండ్రుం గ్రామ పంచాయతీ ఖాంకగుడ గ్రామానికి అంగన్వాడీ కేంద్రం మంజూరు చేసి అంగన్వాడీ టీచరును నియమించాలని గ్రామస్తులు టి.పొరన్న, కె.భాస్కరరావు అర్జీని అందజేసారు. హుకుంపేట మండలం కేంద్రంలోని సర్వే నెం 49/4 ఉన్న స్మశాన వాటికను ఆక్రమించి గుడాలు ఏర్పాటు చేస్తున్నారని వై.ప్రభకారరావు, సిహెచ్.మన్మద ఫిర్యాదు చేసారు. పెదబయలు మండలం పెదకోడాపల్లి పంచాయతీ మొండికోట, చెక్కరాయి, బొడ్డపుట్టు గ్రామాలకు తారురోడ్డు నిర్మించాలని ఎం.మత్స్యలింగం వినతి పత్రం సమర్పించారు. డుంబ్రిగుడ మండలం కండ్రుం పంచాయతీ సర్రాయి, జాకర వలస తాగునీటి పథకానికి విద్యుత్ ట్రాన్సఫార్మర్ ఏర్పాటు చేయాలని, దండగూడ, బైలుగూడ గ్రామాలకు సోలార్ తాగునీటి పథకం మంజూరు చేయాలని సర్పంచ్ కిముడు హరి వినతి పత్రం అందజేసారు. డుంబ్రిగుడ మండల చంపపట్టి గ్రామం వాగుపై వంతెన హుద్ హుద్ తుఫానులో శిధిలమైందని దానిని తిరిగి నిర్మించి పంచాయతిలోని చంపపట్టి, జాంకర వలస, సీలా గొంది, ఉయ్యాలగూడ, కోసంగి గ్రామాలకు రహదారి సదుపాయాలు కల్పించాలని టి.దొబ్బన్న, టి.రాజు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ పి.అంబేద్కర్, ఐటిడిఎ ఎపిఒ ఎం.వెంకటేశ్వరరావు, టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావు, డిఎంహెచ్‌ఒ జమాల్ బాషా, టిడబ్ల్యూ ఇఇలు డివిఆర్‌ఎం రాజు, కె.వేణుగోపాల్, ఆర్ డబ్ల్యూఎస్ ఇఇ లీలాకష్ణ, డిపిఆర్ ఒ పిఎస్ కుమార్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్ బిఎస్ నంద్, ఐడిడిఎ పరిపాలనాధికారి హేమ పాల్గొన్నారు.