ప్రజాశక్తి- అనంతగిరి : పండ్ల తోటల పెంపకంతో రైతులు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని రాష్ట్ర సిఆర్‌డి ప్లాంటేషన్ సెక్షన్ డిప్యూటీ కమిషనర్ సి.భవాని అన్నారు. వ్యవసాయ పంటలతో పాటు ఏడాదికి ఒకసారి రైతులకు ఆదాయాన్నిచ్చే పండ్ల తోటల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు. మంగళవారం మండలంలోని ఎన్‌ఆర్ పురం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలను సందర్శించారు. ఉద్యానవనశాఖ ద్వారా రైతులకు పంపిణీ చేసిన పండ్ల మొక్కల స్థితిగతులను పరిశీలించారు. ఉపాధిహామీ వేతనాలు సక్రమంగా అందుతున్నదీ లేనిదీ గిరిజన రైతులను ప్రశ్నించి అడిగి తెలుసుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఆదాయాన్ని అందించే పండ్ల తోటల పెంపకంపై రైతులు ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపాధి పనిదినాలను 100 నుంచి 150రోజులకు పెంచాలని పలువురు గిరిజనులు విన్నవించగా, దీనిపై ప్రభుత్వానికి నివేదిస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ టీం కొండ నాయక్, సుధీర్, ఉపాధి హామీ పథకం ఇన్‌ఛార్జి ఎపిడి పవన్, టెక్నికల్ అసిస్టెంట్ కొండబాబు పాల్గొన్నారు










