Oct 19,2023 22:19

పండ్ల తోటల రైతుల రాష్ట్ర సదస్సులో మాట్లాడుతున్న రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి

       తాడిపత్రి : పండ్ల తోటల సాగు చేసే రైతులకు ఎలాంటి ప్రోత్సహకాలు అందించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నాయని రైతుసంఘం నాయకులు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పండ్ల తోటల రైతుల సమస్యలపై రాష్ట్ర సదస్సును గురువారం నిర్వహించారు. పండ్లతోటల రైతు సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు శివారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌ రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు వి.రాంభూపాల్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, ఎన్టీఆర్‌, ఏలూరు, తూర్పు గోదావరి, విజయనగరం తదితర 12 జిల్లాల్లో లక్షలాది మంది రైతులు సాగు చేస్తున్నారని చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో వీటి సాగు మరింత ఎక్కువగా ఉందన్నారు. గత ప్రభుత్వం రాయలసీమ ప్రాంతాన్ని పండ్లతోటల కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆచరణలో సాగు రైతులకు అందించిన సాయం అంతంత మాత్రమే అన్నారు. మార్కెట్‌ సౌకర్యం, పండిన పండ్లను నిలువ చేసుకునేందుకు అవసరమైన శీతల గిడ్డంగుల నిర్మాణం, మద్దతు ధరలు వచ్చేలా నిర్దిష్టమైన ధరల విధానం వంటివి అమలు చేయడంలో విఫలం అయ్యిందన్నారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక పండ్ల తోటలను పూర్తిగా విస్మరించిందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వలేదన్నారు. పండ్లతోటలు ఎక్కువగా సాగు అవుతున్న ప్రాంతాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను అభివద్ధి చేస్తామని, రైతులు పండించే పండ్లకు నుంచి మార్కెట్‌ సౌకర్యం కల్పిస్తామనే హామీని ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం మాటలు నమ్మి పండ్ల తోటలు సాగు చేసిన రైతులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల్లో ధైర్యం నింపాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రకాల పండ్ల తోటలకు మాత్రమే పంటల బీమా అమలు చేస్తూ ఆచరణలో పండ్ల తోటల రైతులను నిరుత్సాహానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండ్ల తోటల రైతుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పండ్ల తోటల రైతుల సమస్యలపై 10 తీర్మానాలను సమావేశంలో ప్రవేశపెట్టారు. వీటిని సభ ఏకగ్రీవంగా ఆమోదించి వీటి పరిష్కారం కోసం ఐక్యపోరాటాలు నిర్వహించేలా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అనంతపురం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, చంద్రశేఖర్‌ రెడ్డి, నాయకులు బిహెచ్‌.రాయుడు, జగన్మోహన్‌ రెడ్డి, నంద్యాల జిల్లా రైతు సంఘం నాయకులు నరసింహ, కడప జిల్లా రైతు సంఘం నాయకులు దస్తగిరి రెడ్డి, తాడిపత్రి మండల కమిటీ నాయకులు రాజారామిరెడ్డి, శిరీష, రెడ్డి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
తీర్మానాలు
1. అన్ని రకాల పండ్లకు మద్దతు ధరల విధానం ప్రవేశపెట్టాలి.
2. పండ్ల తోటలకు, దిగుబడి ఆధారిత వాతావరణ సమగ్ర పంటల బీమా పథకం అమలు పరచాలి. బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించాలి.
3. పండ్ల తోటలున్న ప్రాతాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు సహకార ప్రభుత్వ రగంలో స్థాపించాలి.
4. పండ్లు నిలువ చేసుకునేందుకు సహకార శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలి.
5. పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రత్యేకంగా పండ్ల మార్కెట్లు ఏర్పాటు చేయాలి. మార్కెట్లలో దోపిడీలను అరికట్టడానికి చర్యలు చేపట్టాలి.
6. డ్రిప్‌, స్ప్రింక్లర్లు, ఇతర పరికరాలు 90 శాతం సబ్సిడీపై ఇవ్వాలి.
7. ఈ ఏడాది పండ్ల తోటలు డీ హైడ్రేషన్‌ పరిస్థితి రాకుండా చర్యలు చేపట్టాలి.
8. బోర్లు ఎండిపోయిన రైతులకు ఉచితంగా బోర్లు వేయాలి.
9. రైతు భరోసా పథకాన్ని రూ. 25వేలకు పెంచాలి.
10. పండ్ల తోటలున్న ప్రాంతాల నుంచి రైల్వే రవాణా సౌకర్యం దేశంలోని అన్ని ప్రాంతాలకు ఏర్పాటు చేయాలి. తీర్మానాలను రాష్ట్ర సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది.