Nov 14,2023 21:05

సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కమిషనర్‌

ప్రజాశక్తి - కోసిగి
మండలంలో ఉన్న రైతులు పండ్ల తోటలు పెంచుకుంటే అధిక లాభాలు వస్తాయని, వలసలను నివారించవచ్చని పంచాయతీ రాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ జాయింట్‌ కమిషనర్‌ శివప్రసాద్‌ తెలిపారు. మంగళవారం స్థానిక ముసలి మారెమ్మ దేవాలయం, బెళగల్‌ గ్రామస్తులతో, ఉపాధి కూలీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానికంగా ఉపాధి పనులు చేసి వలసలు వెళ్లకుండా ఇక్కడే ఉంటూ పండ్లతోటల పెంపకంతో వ్యవసాయం చేసుకోవాలన్నారు. వంద రోజులు ఉపాధి పనులు పూర్తయిన వారికి మరో 50 రోజులు అదనంగా పనులు కల్పిస్తామన్నారు. నీళ్లు లేని భూముల్లో సీతాఫలం, నల్లరేగు, టేకు వంటి చెట్లు ఉపాధి హామీ చట్టం కింద ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఉపాధి హామీ చట్టంలో 16 రకాల పండ్ల తోటల పెంపకంపై అవగాహన కల్పించి అవసరమైన రైతులకు చెట్లు అందజేస్తామన్నారు. కరువు మండలం కావడంతో జూన్‌ వరకు 150 రోజులు పనులు కల్పిస్తామన్నారు. వలస వెళ్లకుండా గ్రామస్తులు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పులికనుమ ప్రాజెక్టు నుంచి తూము ఏర్పాటు చేయాలని, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కొంతవరకు వలసలు నివారించవచ్చని గ్రామస్తులు తెలిపారు. ఉపాధి కూలిల చెల్లింపులో ఆలస్యం జరుగుతోందని ఉపాధి కూలీలు అధికారులకు విన్నవించారు. కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఏపీడీ లోకేశ్వరరావు, ఎంపిడిఒ రాజేంద్రప్రసాద్‌, ఏపీవో జయరాముడు, క్లస్టర్‌ టిఎ గిడ్డయ్య పాల్గొన్నారు.