Sep 16,2023 20:45

బిపిఎం గీతపై విచారణ చేస్తున్న సబ్‌ డివిజనల్‌ పోస్టల్‌ ఇన్‌ఛార్జి అమర్‌నాథ్‌

గాలివీడు : గాలివీడు సబ్‌ పోస్టాఫీస్‌ పరిధిలోని పందిళ్లపల్లి బ్రాంచ్‌ పోస్ట్‌ ఆఫీస్‌లో బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న గీత వివిధ పథకాల కింద చిన్న మొత్తాల పొదుపు ద్వారా ఖాతాదారులు చెల్లించిన సోమ్మును చేతివాటం ప్రదర్శిస్తూ రూ.6 లక్షల వరకూ కాజేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని విచారణ అధికారి రాయచోటి సబ్‌ డివిజనల్‌ పోస్టల్‌ ఇన్‌ఛార్జి కె.అమరనాథ్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ సాధారణ తనికీల్లో భాగంగా పందిళ్లపల్లి సబ్‌ పోస్టాఫీస్‌ను ఆకస్మిక తనిఖీ నిర్వహించగా అక్కడ జరిగిన అవినీతి వెలుగులోకి వచ్చిందన్నారు. ఖాతాదారుల వద్ద సొమ్మును వసూళ్లు చేసిన బిపిఎం గీత పోస్టాఫీస్‌లో మాత్రం ఆ సొమ్మును జమ చేయ కుండా కాజేసినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. వెంటనే ఆమెను విధుల నుండి తొలగించి విచారణ ముమ్మరం చేసినట్లు వారు స్పష్టం చేశారు. గ్రామంలోని చాలామంది ఖాతాదారులు తమ ఖాతా పుస్తకాలను బిపిఎం గీత వద్దనే ఉంచడం, నగదు చెల్లింపులు జరిగినప్పుడు ఖాతాదారుల పుస్తకాల్లో నమోదు చేయకపోవడం, ఎలాంటి సీల్‌ గానీ, ముద్రించకపోవడం వంటి చర్యలతో ఖాతాదారుల సొమ్మును అవలీలగా కాజేసినట్లు విచారణలో తేలిం దన్నారు. ఇంకా విచారణ జరుగుతున్నందున పూర్తిస్థాయి విచారణ అనంతరం నిందితురాలిపై చట్టపరమైన చర్యలు తీలుకోవడం జరుగుతుందన్నారు. అవసరమైతే ఖాతాదారుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదుచేసి స్వాహా అయిన సొమ్మును రికవరీ చేస్తామన్నారు.బాధితులు చెల్లించిన సొమ్ముకు రశీదు వుంటే తమను సంప్రదిస్తే తప్పకుండా రికవరీ చేయిస్తామన్నారు. ప్రజలు తపాలా శాఖపై ఎంతో నమ్మకంతో కూలీ, నాలీ చేసుకుని, వద్ధులు, వితం తువులు చిన్నతరహా ఉద్యోగస్తులు ఆర్‌డి, ఆర్‌పిఎల్‌ఐటి, డిఎస్‌ఎస్‌ఎ, మహిళ సమ్మన్‌ యోజన తదితర పొదుపు పథకాల్లో పొదుపు నిమిత్తం చెల్లించిన సొమ్మును అక్రమంగా అన్యాయంగా బిపిఎం గీత కాజేయడం పట్ల ఖాతా దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుం డా తపాలా శాఖ ఉన్నత అధికారులు బ్రాంచ్‌ ఆఫీస్‌ కార్యాలయంలో జరిగిన లావాదేవీలపై పూర్తిస్థాయి విచారణ జరిపి, జరిగిన అవినీతిపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం జరిగేలా చూడాలని ఖాతాదారులు కోరుతున్నారు.