
ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్ : మున్సిపాల్టీ పరిధిలో గల పలు వార్డుల్లో దీపావళి పండుగ పూట కూడా పలు వార్డుల ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పట్టణంలోని పలు ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను తాగునీరు కొరకు ఆశ్రయిస్తుంచారు. ఈనెల 9న మున్సిపల్ పరిధిలో గల 22, 23, 24, 25, 26, 27 వార్డులకు తాగునీటి సరఫరా అందించిన మున్సిపల్ తాగునీటి విభాగం అధికారులు, సిబ్బంది ఆదివారం దీపావళి పండుగ పూట కూడా తాగునీరు సరఫరా చేయకపోవడం చాలా దారుణమని అన్నారు. కనీసం ఆయా వార్డులకు తాగునీటి ట్యాంకుల ద్వారా తాగునీరు సరఫరా చేయడం లేదని ఆయా వార్డుల ప్రజలు అధికారులను బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక పాలకవర్గ కౌన్సిల్ సభ్యులకు చీమకుట్టినట్లైనా లేదని బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలో పట్టణానికి కూత వేటు దూరంలో నాగావళి నది పరివాహాక ప్రాంతమైన్నప్పటికీ వర్షాకాలంలో రంగు మారిన నీటి సరఫరా, శీతాకాలం, వేసవి కాలాల్లో నాలుగు రోజుకొకసారి చాలీచాలని నీటి సరఫరా జరుగుతుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తాగునీటి సమస్యపై దృష్టి పెట్టి కచ్చితమైన ప్రణాళికను రూపొందించి తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.