Mar 21,2023 18:10

ఉపాధి పనులు చేస్తున్న కూలీలు


పండగ పూటా పస్తులే..
- రెండు నెలలుగా అందని ఉపాధి వేతనాలు
- ఇబ్బందుల్లో కూలీలు
ప్రజాశక్తి - బనగానపల్లె

       ఉపాధి కూలీలకు రెండు నెలల నుండి వేతనాలు రాకపోవడంతో పండగ పూట సరుకులు కొనడానికి డబ్బులు లేక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బనగానపల్లె మండలంలో 2600 మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. వీరికి ఫిబ్రవరి నెల 6వ తేదీ నుండి నేటి వరకు వేతనాలు అందలేదు. దీంతో పూట గడవడం కష్టంగా మారింది. పండగ పూట వేతనాలు వస్తే కుటుంబ సభ్యులతో సంతోషంగా పండగ చేసుకుందామని ఆశపడ్డారు. అయితే ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడంతో తెలుగు సంవత్సరాది ఉగాది పండగ రోజు కొత్త బట్టలు కొనడానికి, సరుకులు కొనడానికి డబ్బులు లేక ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండగ సరుకుల కోసం అప్పులు దొరకక అల్లాడుతున్నారు. ముఖ్యంగా మండలంలోని పడమటి పల్లెల్లో పనులు లేకపోవడంతో కూలీలందరూ ఉపాధి పనికి వెళ్లారు. గతంలో నెలరోజులకే వేతనాలు బ్యాంకు ఖాతాలో జమ చేసే వారు. ఈ సంవత్సరం రెండు నెలలు గడుస్తున్నా ఉపాధి కూలీల వేతనాలు జమ కాలేదు. రెక్కాడితే గాని డొక్కాడని పేద కూలీల అవస్థలు వర్ణనాతీతం. జనవరి నెలలో జరిగిన రెండు వారాల పనులకు మాత్రమే డబ్బులు వచ్చాయని, దాదాపుగా ఏడు వారాల నుంచి వేతనాలు రావడం లేదని కూలీలు చెబుతున్నారు. ఇలాగే ఆలస్యమైతే ఉపాధి పనులకు వెళ్లలేమని కూలీలు వాపోతున్నారు. అధికారులు స్పందించి వేతనాలు త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.
రెండు నెలల నుండి వేతనాలు రావడం లేదు
ఉపాధి కూలీ వరలక్ష్మీ, పెద్దరాజుపాలెం గ్రామం
రెండు నెలల నుండి ఉపాధి కూలీ వేతనం రావడం లేదు. పండుగ పూట పస్తులు ఉండవలసిన పరిస్థితి నెలకొంది. ఉగాది పండుగకు కూలిలు ఇస్తారని ఎంతో ఆశపడ్డాం. కానీ కూలిలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి కూలిలు త్వరగా వచ్చేలా చూడాలి.