Nov 11,2023 23:34

పండగ పూట విషాదం

పిక్నిక్‌ సరదా ఓ విద్యార్థి ప్రాణాన్ని బలితీసుకుంది. దీంతో ఆ తల్లిదండ్రులకు గర్భసోకం మిగిలింది. దీపావళి వెలుగులు చూడకుండా పోయారు. చెట్టంత కొడుకు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. చేతికంది వచ్చిన మా ఆశల దీపం ఆరిపోయిందని ఆ కుటుంబం హృదయ విదారకంగా విలపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే...
సముద్ర కెరటాల్లో చిక్కుకుని విద్యార్థి మృతి
ఆశల దీపం ఆరిపోయిందని
రోదిస్తున్న తల్లిదండ్రులు
ప్రజాశక్తి- బూర్జ :
బూర్జ మండలం కొల్లివలసకు చెందిన పొట్నూరు మణి మోహన్‌ (మణికంఠ) (15) తోటవాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. దీపావళికి మూడు రోజులు ప్రబుత్వం సెలవులను ప్రకటించింది. దీంతో ఆ పాఠశాలలో చదువుకుంటున్న 13 మంది మిత్రులు కలిసి సరదాగా పిక్నిక్‌కు వెళ్దామని శనివారం ఉదయం 7 గంటలకే ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. గార మండలం కళింగపట్నం సమీపంలో మొగదలపాడు సముద్ర తీరానికి చేరుకున్నారు. అక్కడ భోజనాలు చేసి సరదాగా సముద్రతీరంలో వెళ్లి స్నానం చేస్తూ.. ఉత్సాహంగా గడిపారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. ఇంతలో సముద్ర కెరటం ఉవ్వెత్తున రావటంతో ఆ కెరటంలో మణి మోహన్‌ అనే విద్యార్థి చిక్కుకున్నాడు. బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. వెంటనే తోటి విద్యార్థులు కేకలు వేస్తూ భయాందోళనకు గురయ్యారు. అందుబాటులో ఉన్న ఈతగాళ్లు, జాలర్లు పరిగెత్తుకొని వచ్చి బోట్లు వేసుకుని వెళ్లి ఆ విద్యార్థిని గాలించి బయటకు తీసుకువచ్చారు. అయినా వాళ్ల శ్రమ ఫలించలేదు. వెంటనే జిల్లా సర్వజానస్పత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యంలో ఆ విద్యార్థి మృతి చెందాడు. దీంతో తోటి విద్యార్థులు నిర్ఘాంతపోయారు. ఏం చేయాలో తోచక... వాళ్ల నోటి మాటరాక మూగపోయారు. ఎలాగోలా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొల్లివలసలోని చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు మిత్రులు స్థానికులు సముద్రతీరానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం కోసం జిల్లా సర్వజనాస్పత్రికి తరలించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.