ప్రజాశక్తి-విజయనగరం : పైడితల్లమ్మ జాతర సమయానికల్లా వీలైనన్ని రహదారులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పేర్కొన్నారు. గురువారం అంబేద్కర్ జంక్షన్ నుంచి గంటస్థంభం వరకు నిర్మితమైన రహదారి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ప్రధాన రహదారులు ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. మయూరి జంక్షన్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు, ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచ్ నుంచి రామారాయుడు రహదారి, గణేష్ కోవెల నుంచి ఎస్‌బిటి మార్కెట్ వరకు, అంబేద్కర్ జంక్షన్ నుంచి గంట స్తంభం వరకు, ఆర్ అండ్ బి జంక్షన్ నుండి పాల్ నగర్ వరకు ప్రధాన రహదారులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్యాంక్ బండ్ రోడ్ లో ఉన్న పెద్ద చెరువు గట్టు భాగాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుండి నగరంలో ప్రత్యేక పారిశుధ్య విధానం పై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, నగరపాలక సంస్థ డిఇలు, ఎఇలు తదితరులు పాల్గొన్నారు.
రహదారి పనులు ప్రారంభం
నగరంలోని 7వ డివిజన్లో రూ.33.50తో ఏర్పాటు చేసిన రహదారులను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు. గురువారం ఆ డివిజన్‌లో శుద్ధ వీధి, యాతవీధి, గొల్లవీధులలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పర్యటించిన సందర్భంలో స్థానికుల వినతి మేరకు రహదారి ఏర్పాటుకు హామీ ఇచ్చారు. రహదారులను ప్రారంభించి ప్రజా వినియోగంలోకి తీసుకు వచ్చారు. మేయర్ విజయలక్ష్మి, డివిజన్ కార్పొరేటర్ పొంతపల్లి మాలతి, జోనల్ ఇన్‌ఛార్జి బోడసింగి ఈశ్వరరావు, జోనల్‌ఇంఛార్జి బొద్దాన అప్పారావు, వైసిపి నాయకులు పొంతపల్లి గోపి, చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు










