సంక్రాంతికి పందెంరాయుళ్లు సిద్ధం
కోళ్లకు తర్ఫీదులో నిమగం
గతేడాది పండుగ మూడు రోజుల్లో రూ.200 కోట్లకుపైనే బెట్టింగ్
పలు గ్రామాల్లో ఇప్పటి నుంచే మొదలైన పందేల జోరు.. పట్టని పోలీసులు
పందేలకు అడ్డుకట్టపై ప్రభుత్వం మౌనం
లెక్కల కోసమే బైండోవర్ కేసుల నమోదు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
సంక్రాంతి దగ్గర పడుతుండటంతో పందెంరాయుళ్లు కోడి పందేలకు సన్నద్ధమవుతున్నారు. పందెం పుంజులకు ఇప్పటి నుంచే జీడిపప్పు, పిస్తా, జొన్నలు, గంట్లు వంటి పౌష్టికాహారం అందించడంతోపాటు ఈత కొట్టిస్తూ పందేలకు సన్నద్ధం చేసే పనిలో నిమగమయ్యారు. ట్రయల్ రన్ తరహాలో ఇప్పటి నుంచే రెండు జిల్లాలవ్యాప్తంగా పలు గ్రామాల్లో కోడిపందేలు సాగుతున్నా పోలీసులు పెద్దగా పట్టించుకోని పరిస్థితి ఉంది. కోడి పందేలకు అడ్డుకట్ట వేయాలని జనం, సామాజికవేత్తలు మొర పెట్టుకుంటున్నా, కోర్టులు తీర్పులిచ్చినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రతియేటా సంక్రాంతి పండుగ మూడు రోజులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విచ్చలవిడిగా కోడిపందేలకు అనుమతులిచ్చేస్తున్నారు. కోర్టులకు లెక్కలు చూపించుకునేందుకు మాత్రం బరులను ధ్వంసం చేసి, బైండోవర్ కేసులు నమోదు చేసి పోలీసులు హడావుడి చేస్తున్నారు. గతేడాది సంక్రాంతి పండుగ మూడు రోజులు పందేలకు అనుమతివ్వడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 400 బరుల్లో కోడి పందేలు సాగాయి. బెట్టింగుల రూపంలో రూ.200 కోట్లకుపైగా చేతులు మారినట్లు అంచనా. పండుగ మూడు రోజులు రాత్రీ పగలు తేడా లేకుండా ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో పందేల జోరు సాగింది. బరుల ప్రాంతాలన్నీ జాతరను తలపించాయి. పలుచోట్ల తాజా, మాజీ ఎంఎల్‌ఎలే దగ్గరుండి పందేలను ప్రారంభించడం గమనార్హం. పందేలతోపాటు మూడుముక్కలాట, గుండాటకు సైతం అనుమతులివ్వడంతో పందేలు చూసేందుకు వెళ్లిన యువత వాటికి ఆకర్షితులై జేబులు గుల్ల చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ మూడు రోజులు పోలీసులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాల్లేవు. ఈ ఏడాది కూడా అదే తరహాలో పందేలు సాగించాలని బరుల నిర్వాహకులు ఇప్పటి నుంచే ఏర్పాట్లపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఎవరికి ఎంత మామూళ్లు ఇవ్వాలి, ఎంతమంది వస్తారు, ఏర్పాట్లు ఏవిధంగా చేయాలనే అంశాలపై చర్చలు సైతం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే పందేలరాయుళ్లకు ఇప్పటి నుంచే హోటళ్లలో గదులు బుక్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రతియేటా బరులు ధ్వంసం చేస్తున్నట్లు, వేల సంఖ్యలో బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నా పందేలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. కోర్టు ఆదేశాలను అమలు చేసి పందేలకు అద్డుకట్ట వేయాలని జంతుప్రేమికులు, సామా జికవేత్తలు, జనం కోరుతున్నా పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ ఏడాదైనా పందేలకు అడ్డుకట్ట వేయాలని అంతా కోరుతున్నారు.
రాజకీయ నాయకుల కనుసన్నల్లో కోడి పందేలు
సంక్రాంతి పండుగకు ముందు నుంచే గ్రామాల్లో పందేల జోరు మొదలవుతోంది. గతంలో వీటిని అడ్డుకునేందుకు పోలీసులు దాడులు నిర్వహించేవారు. కొంతకాలంగా కోడిపందేలపై దాడులు తగ్గిపోయినట్లు చర్చ సాగుతోంది. దీనికి ప్రధాన కారణం రాజకీయ నాయకుల జోక్యమేనని చెప్పొచ్చు. ఎంఎల్‌ఎల ఇచ్చిన లేఖల ఆధారంగా ఎస్‌ఐల నియామకం సాగుతోంది. దీంతో ఎంఎల్‌ఎలు, వారి అనుచరులు చెప్పిన విధంగా పోలీసులు నడుచుకుంటున్న పరిస్థితి కన్పిస్తోంది. ఎక్కడైనా పందేలు జరుగుతున్నట్లు సమాచారం అంది పోలీసులు వెళ్లినా వాళ్లు మన పార్టీ కార్యకర్తలే పట్టించుకోవద్దని రాజకీయ నాయకుల నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయి. దీంతో పోలీసులు దాడులు చేయడం పూర్తిగా తగ్గించేశారు. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పందేలపై దాడులు పెద్దగా లేకుండాపోయాయని బహిరంగంగానే చర్చ సాగుతోంది. పోలీసుల దాడులు తగ్గిపోవడంతో పందెంరాయుళ్లు రెచ్చిపోతున్నారు. దీంతో పండుగ మూడు రోజులే కాకుండా ఇప్పటి నుంచే గ్రామాల్లో పందేల జోరు సాగనుంది.










