Apr 11,2021 06:59

   రాజకీయంగా సైద్ధాంతికంగా కేంద్ర బిజెపి వేసిన పాచికలన్నీ విఫలం చేయడంతో పాటు రాష్ట్రంలో యుడిఎఫ్‌ కు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ దుర్నీతిని కూడా ఎల్‌డిఎఫ్‌ ఎదుర్కోవలసి వచ్చింది. బిజెపి మొదట్లో వీరంగం వేసినా తీరా ఎన్నికలు వచ్చే నాటికి సోదిలో లేకుండా పోయింది. స్థానిక ఎన్నికల విజయంతో ఇనుమడించిన విశ్వాసం ఎల్‌డిఎఫ్‌ ను ముందుకు నడిపించింది.
   మమతా బెనర్జీ తృణమూల్‌ ప్రజా వ్యతిరేక పాలనపై అసంతృప్తి తీవ్రంగానే వుండటమే గాక ఆ పార్టీ కీలక నేతలు మాజీ మంత్రులతో సహా బిజెపిలో చేరారు. తనదైన అఘాయిత్య శైలిలో ప్రచారం చేసిన మమత హఠాత్తుగా బిజెపిపై పోరాడాలంటూ వివిధ ప్రాంతీయ పార్టీలకూ కాంగ్రెస్‌కు లేఖ రాయడం హాస్యాస్పదంగా మారింది.
   ఒక్క బెంగాల్‌ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ పూర్తయిపోయింది. ఆ రాష్ట్రంలో మాత్రం రాజకీయ ఉద్దేశాలతో సుదీర్ఘకాలం ప్రకటించిన ఎన్నికల షెడ్యూలు సాగుతూ వుంది. అధికారమే పరమావధిగా కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో పాలించే తృణమూల్‌ కాంగ్రెస్‌లు హీనస్థాయిలో కీచులాడుకుంటున్నాయి. శనివారం పోలింగ్‌లో హింసాకాండ, సిఐఎస్‌ఎఫ్‌ కాల్పులలో నలుగురు మరణించడం అక్కడ ఉద్రిక్తతను ప్రతిబింబిస్తున్నాయి. మిగిలిన దశలు కూడా పూర్తయి ఫలితాలు రావడానికి మే నెల మూడవ తేదీ వరకూ ఆగాలి గనక ప్రజల్లోనూ పార్టీల్లోనూ ఉత్సుకత భారీగానే నెలకొంది. మీడియా వ్యాఖ్యాతలూ పరిశీలకులూ సర్వేలూ కూడా ఇందుకు సంబంధించి రకరకాల అంచనాలు విడుదల చేస్తున్నారు. అవన్నీ గమనించినప్పుడు ఒక విషయం మాత్రం రూఢి అవుతున్నది. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలు లేదా పంచతంత్రం బిజెపి కి అనుకూలంగా వుండబోవడం లేదు. ఆ పార్టీకి ఈ దఫా ఫలితాలు పూర్తి వ్యతిరేకంగా వుంటాయనే అంచనాలు కొన్నయితే మిశ్రమంగా వుండటం తథ్యంగా కనిపిస్తుంది. రెండవ దఫా మూడు వందల పైన స్థానాలు తెచ్చుకున్నప్పటికీ రైతాంగ ఆందోళన, కార్మికుల సార్వత్రిక సమ్మె, రాష్ట్రాల నిరసన, కోవిడ్‌ సవాలు, ఆర్థిక సంక్షోభం తదితర సవాళ్ల వలయంలో చిక్కుకున్న ప్రధాని మోడీకి ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలు నల్లేరు మీద బండిలాగా వుండబోవని మాత్రం ఇప్పటికే స్పష్టమై పోయింది. దక్షిణాది రాష్ట్రాలలోనూ పాగా వేస్తామంటూ ఆ పార్టీ ఆర్‌ఎస్‌ఎస్‌ తో కలసి మొదట చేసిన హడావుడి గుర్తు చేసుకుంటే ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నమైన దృశ్యంగా వుంది.

                                                      ఎవరినడిగినా ఎల్‌డిఎఫ్‌

   ఈ అయిదు రాష్ట్రాలలోనూ ఎవరికీ పెద్దగా సందేహం లేని సర్వే ఫలితాలు వచ్చింది కేరళపైన. రాష్ట్రంలో ప్రతి ఎన్నికలో ప్రభుత్వాలు మారే నాలుగు దశాబ్దాల చరిత్రను తిరగ రాస్తూ ఈ సారి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ తిరిగి అధికారంలోకి రాబోతుందని దాదాపు సర్వేలన్నీ ఘోషిస్తున్నాయి. దశలవారీగా జరిపిన సర్వేలలో కూడా ఈ అంచనా మారకపోవడం విశేషం, ఇందుకు ప్రధాన కారణం ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ప్రతికూల పరిస్థితులలోనూ ప్రభుత్వం సాగించిన సమర్థ పాలన, సంక్షేమ పథకాలు, సహేతుక విధానాలు. దేశ వ్యాపితంగానే గాక ప్రపంచంలో ఇతర చోట్ల వున్న మళయాలీలు ఇతరులు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఫలితమిది. రాజకీయంగా సైద్ధాంతికంగా కేంద్ర బిజెపి వేసిన పాచికలన్నీ విఫలం చేయడంతో పాటు రాష్ట్రంలో యుడిఎఫ్‌ కు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ దుర్నీతిని కూడా ఎల్‌డిఎఫ్‌ ఎదుర్కోవలసి వచ్చింది. బిజెపి మొదట్లో వీరంగం వేసినా తీరా ఎన్నికలు వచ్చే నాటికి సోదిలో లేకుండా పోయింది. స్థానిక ఎన్నికల విజయంతో ఇనుమడించిన విశ్వాసం ఎల్‌డిఎఫ్‌ ను ముందుకు నడిపించింది. తాజాగా ఒక తెలుగు పత్రికలో ప్రొఫెసర్‌ గారొకరు రాసినట్టు కేవలం కులపరమైన పొందికలు మాత్రమే ఈ ఫలితానికి కారణం కాదు. కేరళపై ప్రత్యేక వ్యాసం రాబోతుంది గనక ఇతర రాష్ట్రాల విషయం ఎక్కువగా చూద్దాం.

                                            తమిళనాడులో డిఎంకె కూటమి !

   కేరళ లాగే తమిళనాడు లోనూ ఒక్కో ఎన్నికలో ఒక ప్రభుత్వం మారుతుండేది. కాని 2016లో ఈ వరవడిని జయలలిత అధిగమించి మళ్లీ అధికారంలోకి వచ్చారు. కమ్యూనిస్టులు, ఎండిఎంకె, విఎంసికె 'ప్రజా సంక్షేమ వేదిక' పేరిట విడిగా పోటీ చేసినందువల్ల డిఎంకె విజయం సాధించలేకపోయింది. ఈసారి ఆ పార్టీలన్నీ ఒకటిగా వున్నందున అత్యధిక సర్వేలు డిఎంకె కూటమి విజయం ఖాయమని చెబుతున్నాయి. క్షేత్రస్థాయి వాస్తవాలూ అందుకు తగినట్టే వున్నాయి. జయలలిత మరణానంతరం అన్నా డిఎంకెను గుప్పిట్లో పెట్టుకుని దొడ్డిదోవన పెత్తనం తెచ్చుకోవాలన్న బిజెపి పథకానికి పురిట్లోనే సంధి కొట్టింది. పాలక అన్నా డిఎంకె పొత్తు అంటూనే కొంచెం విడగొట్టుకోగా బిజెపి నేతల అవాకులు మరింత వ్యతిరేకత పెంచాయి. ద్రవిడ ఉద్యమం ప్రాంతీయ పార్టీల పట్టు ప్రధానంగా సాగే తమిళ రాజకీయాలలో బిజెపి కాలూనడం అంత తేలిక కాదని ముందే తేలిపోయింది. వారు ఎంతో ఆశ పెట్టుకుని రాజకీయ ప్రదక్షిణలు చేసినా రజనీకాంత్‌ చివరకు తోక ముడిచేయడం ఓటమి ఖాయమన్న అంచనానే. జయలలిత నెచ్చెలి శశికళ విడుదలైనా రాజకీయ ప్రాతిపదికన రెండు శిబిరాలుగా వున్న రాష్ట్రంలో పెద్ద పాత్ర వహించలేకపోయారు. ముఖ్యమంత్రి పళనిస్వామి పట్టు బాగా పెంచుకున్నారని ప్రచారం జరిగినా ఎన్నికల క్రమంలో పెద్దగా అక్కరకు రాలేదు. లోక్‌సభ ఎన్నికల్లో 37కు 36 స్థానాలు తెచ్చుకున్న డిఎంకె కూటమిదే ఘన విజయమని, స్టాలిన్‌ ముఖ్యమంత్రి అవుతారని రాజకీయంగా మానసికంగా అంతా సంసిద్ధమైపోయారు. కమల్‌హాసన్‌ ఇతరులతో కలసి పోటీ చేస్తున్నప్పటికీ అతి పరిమితమైన ప్రభావం మాత్రమే వుండొచ్చు. కాంగ్రెస్‌ ఇక్కడ కూడా పేచీలు పెట్టుకుని స్టాలిన్‌ అడ్డం తిరిగిన తర్వాత దాదాపు కాళ్ల బేరానికి వచ్చినంతపనైంది. బిజెపి మార్కు మత రాజకీయాల పైన కేంద్రం ఆధిపత్య పోకడల పైన కూడా స్టాలిన్‌ గట్టిగా మాట్లాడుతూ బిజెపి వ్యతిరేక శక్తిగా డిఎంకెను ముందుకు తెచ్చారు. డిఎంకె, దాంతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు ఇతరులదే విజయమన్న వాతావరణం బలంగా నెలకొంది.

                                                  పాండీలో ఏమవుతుంది ?

   కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఫిరాయింపుల క్రీడతో బిజెపి కూలగొట్టింది (ఈ పథకంలో ఎ.పి ముఖ్యమంత్రి జగన్‌ సన్నిహితుడైన మాజీ మంత్రి కృష్ణారావు పాత్ర కూడా కీలకమంటారు). తమిళనాడులో కాకున్నా పాండీలోనైనా పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్నది. బిజెపి తమిళనాడు అధ్యక్షురాలుగా వుండి తెలంగాణ గవర్నర్‌ అయిన తమిళసై కి తాత్కాలిక బాధ్యతనిచ్చి అక్కడకు పంపడం ఇందులో భాగమే. నారాయణస్వామి వర్గం కాంగ్రెస్‌ నుంచి నిష్క్రమించి ఎన్‌.ఆర్‌ కాంగ్రెస్‌ ఏర్పాటు చేయడం గతంలోనే ఆ పార్టీని బలహీనపర్చింది. ఇప్పుడు మరికొంతమంది ఆ పార్టీ ఫిరాయింపుదారులు బిజెపితో కలిశారు. కాంగ్రెస్‌, డిఎంకె, వామపక్ష సంఘటన ఈ కూటమిని ఓడించగలదేమో చూడవలసి వుంటుంది.

                                                     అసోంలో అటూ ఇటూ..

   ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాలలోనూ బిజెపి అధికారంలో వున్న రాష్ట్రం ఇదొక్కటే. మొదటిసారిగా 2016లో కాంగ్రెస్‌ నుంచి చీలిపోయి వచ్చిన వారి సాయంతో ఎజిపి పొత్తుతో బిజెపి గెలవగలిగింది. పౌరసత్వం, బంగ్లాదేశ్‌ శరణార్థుల సమస్య, జాతి మత విద్వేషాలు ఆధారంగా ప్రజలను రెచ్చగొట్టి మరీ విజయం సాధించిన బిజెపి ఈసారి అంత ధీమాగా లేదు. సిఎఎ, ఎన్‌ఆర్‌సి లు ప్రధానాస్త్రాలుగా ఉపకరిస్తాయనుకున్న ఆ పార్టీ దేశంలో రాజకీయ వాతావరణం ఇతర రాష్ట్రాలలో పోటీ కారణంగా అనేక విన్యాసాలు చేసింది. ఆ రాష్ట్రంలోనే కొన్నిచోట్ల సిఎఎ అమలు చేస్తామని మరికొన్నిచోట్ల చేయబోనని మాట్లాడింది. కొత్త ప్రభుత్వానికి నాయకుడెవరనే సమస్య కూడా ఆ పార్టీని వెన్నాడుతున్నది. అసోంలో బిజెపి ప్రభుత్వం వుంది గనకనే ఈశాన్య రాష్ట్రాలలో ఆ పార్టీ సామ దాన భేద దండోపాయాలతో పట్టు పెంచుకుంది. ఈసారి కూడా హోంమంత్రి అమిత్‌షా తో సహా కేంద్రీకరించి ప్రచారం చేశారు. అందుకే అక్కడ బిజెపిని ఓడించడం అవసరమనే లక్ష్యంతో సిపిఎం, సిపిఐ, ఎం.ఎల్‌ పార్టీలు కాంగ్రెస్‌తో కలసి పోటీ చేశాయి.12 పార్టీల ఈ కూటమిలో ఎఐఎంఎల్‌ ముఖ్య భాగస్వామిగా వుంది. ఈ పార్టీ వ్యవస్థాపకుడైన పరిమళ ద్రవ్యాల వ్యాపారి అజ్మాల్‌ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు. అందుకే పోటాపోటీగా సాగిన అసోం ఎన్నికల పోరాటం ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక్కడ బిజెపి అధికారం కోల్పోతే ఈశాన్యాన అది పెద్ద మలుపు అవుతుంది.
బెంగాల్‌ అనిశ్చితం
   అయిదు రాష్ట్రాల లోనూ అత్యంత అనిశ్చితంగా, క్లిష్టంగా కొనసాగుతున్నది పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు. ఇక్కడ బిజెపి సవాలు వాస్తవమే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 42లో 18 స్థానాలతో పాటు 40 శాతం ఓట్లు తెచ్చుకోగా వామపక్షాల ఓట్ల శాతం ఏడుకు పడిపోయింది. మమతా బెనర్జీ తృణమూల్‌ ప్రజా వ్యతిరేక పాలనపై అసంతృప్తి తీవ్రంగానే వుండటమే గాక ఆ పార్టీ కీలక నేతలు మాజీ మంత్రులతో సహా బిజెపిలో చేరారు. తనదైన అఘాయిత్య శైలిలో ప్రచారం చేసిన మమత హఠాత్తుగా బిజెపిపై పోరాడాలంటూ వివిధ ప్రాంతీయ పార్టీలకూ కాంగ్రెస్‌కు లేఖ రాయడం హాస్యాస్పదంగా మారింది. మరోవంక వామపక్ష సంఘటన కాంగ్రెస్‌ ఐఎస్‌ఎఫ్‌ల కూటమి ప్రచారంలో జనసమీకరణలో బలమైన ప్రభావం చూపింది. అయితే చాలా సర్వేలు మమత మరోసారి వస్తారనే అంచనాలు ఇచ్చాయి. ఆమె సలహాదారు ప్రశాంత కిశోర్‌ బిజెపి కి వంద పైన వస్తే తాను ఈ వృత్తి నుంచి తప్పుకుంటానని సవాలు చేశారు. అయితే తృణమూల్‌ అంతర్గత సర్వే లోనే బిజెపి గెలుస్తుందని వచ్చినట్టు పి.కె స్వయాన ఒప్పుకున్నారని బిజెపి నాయకులొకరు ట్వీట్‌ చేశారు, తాను అన్న సందర్భం వేరని వివరణ ఇచ్చినప్పటికీ ప్రశాంత్‌ కిశోర్‌ ఆ కథనాన్ని మాత్రం ఖండించలేదు. అలాగే బిజెపిని ఓడించడం కోసం తృణమూల్‌ను బలపర్చాలనే వాదనతో సిపిఎం ఏకీభవించలేదు. ఎందుకంటే మమత పాలన మొత్తం వామపక్షాలపై దాడిగానే సాగింది. హంగ్‌ అసెంబ్లీ వచ్చేట్టయితే తృణమూల్‌ తమ సహాయం కోరవచ్చని కాంగ్రెస్‌ నేతలు సంకేతాలివ్వగా ఆ విధంగా ఆమెకు మద్దతునిచ్చే ప్రసక్తి లేదని సిపిఎం కార్యదర్శి సూర్యకాంత్‌ మిశ్రా స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితే వస్తే మమత బిజెపి తో చేతులు కలుపుతారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పిన అంచనాను మిశ్రా పునరుద్ఘాటించారు. ఏమైనా ఈ ఎన్నికల్లో సిపిఎం, వామపక్షాలు పుంజుకుంటాయనే అభిప్రాయం కొందరు పరిశీలకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. యువతను ఎన్నికల్లో ఎక్కువగా నిలబెట్టడం కూడా మన్నన పొందింది. బుద్ధదేవ్‌ పాలనలో తాము సాగించిన కుట్రలను నందిగ్రామ్‌లో పోటీ చేసిన మమతా బెనర్జీ, ఆమె మాజీ అనుయాయులు స్వయంగా వెల్లడించడం చెప్పుకోదగిన పరిణామం. దీనిపై ఆయన స్వయంగా లేఖ విడుదల చేశారు. అదలా వుంచితే పారిశ్రామికీకరణ కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ప్రతిపక్షాలు కట్టకట్టుకుని పక్కదోవ పట్టించాయని సాధారణ ప్రజలు కూడా ఇప్పుడు గుర్తిస్తున్నట్టు క్షేత్రస్థాయి పర్యటన తర్వాత కొందరు సంపాదకులు ఉదహరించారు.
మొత్తంపైన బిజెపి అప్రతిహతమనే భావనను ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్వపక్షం చేస్తాయనడంలో సందేహం లేదు. ఒక తెలుగు పత్రిక రాసినట్టు బిజెపికి లోక్‌సభలో యాభై శాతం స్థానాలున్నాయి గాని రాష్ట్రాలలో అది ముప్పై శాతమే. వివిధ అసెంబ్లీలన్నిటిలో కలిపి 4036 మంది వుంటే బిజెపి కి 1374 మంది మాత్రమే వున్నారు. అది కూడా ఫిరాయింపుల తర్వాత. ఈ పరిస్థితి ఇక ముందూ మారకపోగా బిజెపి ని వ్యతిరేకించే శక్తులకు సానుకూలత పెరగవచ్చు.
 

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి