Oct 10,2023 21:55

సమావేశంలో మాట్లాడుతున్న కిలా సంస్థ జిల్లా కోఆర్డినేటర్‌ సోనియా

       చిలమత్తూరు : ఐఎస్‌ఒ సర్టిఫికెట్‌ ఎంపిక కోసం శ్రీ సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, గోరంట్ల గ్రామ పంచాయతీల్లో ''కిల'' (కేరళ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ లోకల్‌ అడ్మినిస్ట్రేషన్‌) కేరళ బందం మంగళవారం పరిశీలన చేసింది. గ్రామ పంచాయతీల్లోని సచివాలయాలను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు తదితర అంశాలను తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది, మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఐఎస్‌ఒ సర్టిఫికెట్‌ పొందేందుకు ఉండాల్సిన ప్రమాణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలియజేశారు. ఈ సందర్భంగా కేరళ బందం కిలా డిస్ట్రిక్ట్‌ కో-ఆర్డీనేటర్‌ సోనియా మాట్లాడుతూ తాము పరిశీలించిన సచివాలయాల్లో రికార్డుల నిర్వహణ ఐఎస్‌ఒ ప్రమాణాలకు అనుగుణంగా లేవన్నారు. ప్రతి పంచాయతీకి తప్పనిసరిగా రికార్డు రూం ఉండాలన్నారు. రికార్డు రూమ్‌లో కేటగిరి వారీగా సంవత్సరాల ప్రకారం రికార్డులను భద్రంగా ఉంచాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయ వ్యవస్థ ఉద్ధేశం బాగున్నా ఆచరణలో అది కనబడటం లేదని అన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు, ఫీడింగ్‌ రూం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. గ్రామసభల నిర్వహణకు సంబంధించి ముందస్తుగా నోటీసు బోర్డులో తేదీలు పొందుపరచాలాన్నారు. సమాచార బోర్డు, ఉద్యోగుల వివరాలకు సంబంధించిన బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. సరైన బిల్డింగ్‌ ఉన్నప్పటికీ నిర్వహణ లోపం ఉందన్నారు. వీటిని మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పంచాయతీ వ్యవస్థపై అవసరం అయితే సిబ్బంది శిక్షణ తీసుకోవాలని సూచించారు. ఐఎస్‌ఒ సర్టిఫికెట్‌ పొందేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యల గురించి ఆమె సమగ్రంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా పైలెట్‌గానే గ్రామపంచాయతీల ఎంపిక కార్యక్రమం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్‌పిఒ శివనారాయణ రెడ్డి, ఈవోఆర్డీ ఈశ్వరయ్య, కార్యదర్శి మధుసుధన్‌ పాల్గొన్నారు. కాగా కిలా బృందం పర్యటన సందర్భంగా పంచాయతీ ఎంపికకు అర్హత సాధించేలా ఏర్పాట్లు చేసేందుకు పంచాయతీ అధికారులు ముప్పతిప్పలు పడ్డారు. చిలమత్తూరు సచివాలయంలో ఎప్పుడూ లేనిది రిసెప్షన్‌ కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేసి షో చేశారు.
గ్రామ పంచాయతీల నిర్వహణలో కేరళ టాప్‌
గ్రామ పంచాయతీల నిర్వహణలో కేరళ రాష్ట్రం దేశంలోనే టాప్‌లో ఉందని సోనియా తెలిపారు. కేరళలో ప్రతి పంచాయతీకి ఐఎస్‌ఒ గుర్తింపు సర్టిఫికెట్‌ ఉన్నట్లు తెలియజేశారు. అక్కడ మౌలిక వసతుల కల్పన చాలా బాగాఉందన్నారు. రికార్డుల నిర్వహణ, గ్రామసభలు ఇలా అన్నింట్లోనూ అక్కడి పంచాయతీల పనితీరు సరైన పద్ధతిలో ఉంటుందని కితాబునిచ్చారు.