- కేంద్ర ఆర్థిక మంత్రికి ఎంపీ ఫిర్యాదు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ గ్రామ పంచాయతీల హక్కులను కాలరాస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులను సైతం దారిమళ్లించి గ్రామాల్లో కనీస అవసరాలు తీర్చుకోలేని దుస్థితి కల్పించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్‌ల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్స్ ప్రతినిధులతో కలిసి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఢిల్లీలో గురువారం కలిసి ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో రోజువారీ పౌర నిర్వహణ పనులనూ సర్పంచ్‌లు చేయలేకపోతున్నారని చెప్పారు. నిధుల కొరత వల్ల తాగునీటి సరఫరా, పారిశుధ్యానికి ఆటంకం కలుగుతోందని వివరించారు. కేంద్రం మంజూరు చేసిన 15వ ఆర్థికసంఘం నిధులను గ్రామ పంచాయతీల ఖాతాలకు జమ అయిన తర్వాత గంటల వ్యవధిలోనే కొల్లగొట్టారని తెలిపారు. గ్రామ పంచాయతీలకు సమాంతరంగా ఏర్పాటు చేసిన సచివాలయ, వాలంటరీ వ్యవస్థ వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ పతనమైందని వివరించారు.










