Aug 30,2023 00:34

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న డిఎల్‌పిఒ జిఎల్‌ఎన్‌వి.రాఘవన్‌

ప్రజాశక్తి-రంపచోడవరం
గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య సిబ్బందికి జీత భత్యాలు చెల్లించడానికి అవసరమైన ఆదాయం పెంపునకు కృషి చేయాలని పంచాయతీ కార్యదర్శులను డివిజనల్‌ పంచాయతీ అధికారి జిఎల్‌ఎన్‌వి రాఘవన్‌ ఆదేశించారు. రంపచోడవరం డివిజన్‌ పరిధిలోని 7 మండలాల పంచాయతీ విస్తరణ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం రంపచోడవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో డివిజనల్‌ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి అధ్యక్షత వహించిన డిఎల్‌పిఒ రాఘవన్‌ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు మేరకు ప్రాపర్టీ రిజిస్టర్‌ నిర్వహించాలని, బకాయి ఇంటి పన్నులు వెంటనే వసూలు చేయాలని, ప్రభుత్వ భవనాలకు, వ్యాపార సంస్థలకు ఇంటి పన్నులు విధించాలని సూచించారు. గ్రామ పంచాయతీ కచ్చితంగా గ్రామానికి కనీసం ఒక క్లాప్‌ మిత్రాను నియమించుకొని పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, పంచాయతీ రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ప్రాపర్టీ రిజిస్టర్‌ శనివారం లోపు తయారు చేయాలని, సెప్టెంబర్‌ చివరి నాటికి ఇళ్ల పన్నుల వసూలు ప్రారంభించాలని కోరారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ షెడ్‌ల నిర్వహణ బాధ్యతలు వ్యవసాయ, ఉద్యానవన సహాయకులకు అప్పగించాలన్నారు. రిక్షాలు మరమ్మతులు చేయించి ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్త సేకరించాలని, దీనిపై ప్రచారం చేసే బాధ్యత వాలంటీర్లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లకు అప్పగించాలని సూచించారు. ప్రభుత్వం ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించినందున సదరు ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు వారి దినచర్యలు విస్తరణ అధికారులకు, ప్రతి పక్షం రోజులకు సమర్పించాలని, విస్తరణ అధికారులు తమ దిన చర్యలను డిఎల్‌పిఒకు సమర్పించాలని ఆదేశించారు. డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి కె.కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన ఆధార్‌ నవీకరణ కేంద్రాలలో ఆధార్‌ అప్‌డేషన్‌ను 100 శాతం పూర్తి చేయాలని సూచించారు.