Aug 19,2023 23:12

వైసిపి అభ్యర్థులకు కలిసొచ్చిన సానుభూతి
ఉమ్మడి జిల్లాలో 4 సర్పంచి స్థానాలకు పోలింగ్‌
3 వైసిపి, ఒకటి టిడిపి బలబరిచిన అభ్యర్థుల విజయం
31 వార్డుల్లో 17 వైసిపి , 13 టిడిపి, ఒకటి జనసేన సానుభూతిపరుల గెలుపు
ఏలూరు జిల్లాలో 81.71 శాతం, పశ్చిమలో 79.20 శాతం ఓటింగ్‌
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

రెండు జిల్లాల్లోనూ పంచాయతీ ఉపఎన్నికలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. పంచాయతీ సర్పంచి ఎన్నికల పోరులో వైసిపికి సానుభూతి కలిసొచ్చింది. సర్పంచిగా పనిచేస్తూ మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులే పలుచోట్ల బరిలోకి దిగారు. దీంతో రెండు జిల్లాలో నాలుగు సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరగ్గా మూడుస్థానాల్లో వైసిపి అభ్యర్థులే గెలిచారు. ఒక స్థానంలో టిడిపి బలపరిచిన అభ్యర్థి విజయంసాధించారు. రెండు జిల్లాల్లో 31 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైసిపి బలపరిచిన అభ్యర్థులు అత్యధిక వార్డులను గెలుపొందారు. వివిధ కారణాలతో ఖాళీ అయిన రెండు జిల్లాలోని పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఉప ఎన్నికలకు సంబంధించి ఈనెల ఆరోతేదీన ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఏలూరు జిల్లాలో నాలుగు సర్పంచులు, 47 వార్డులకు, పశ్చిమలో మూడు సర్పంచులు, 27 వార్డులకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడింది. ఈనెల ఎనిమిదో తేదీన నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యేసరికి పశ్చిమలోని మూడు సర్పంచి స్థానాలకుగాను యలమంచిలి మండలం దొడ్డిపట్ల, పాలకొల్లు మండలం అగర్తిపాలెం సర్పంచి పదవులు, వివిధ గ్రామాల్లోని 17 వార్డులకు సంబంధించిన పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఏలూరు జిల్లాలో నాలుగు సర్పంచి, 47 వార్డు పదవులకు నోటిఫికేషన్‌ వెలువడగా ఒక సర్పంచి, 26 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు శనివారం ఎన్నికల జరిగాయి.
వీరమ్మకుంటలో ఇరుగ్రూపుల మధ్య ఘర్షణ
పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయతీ ఎన్నికల్లో టిడిపి, వైసిపి గ్రూపుల మధ్య కొంత సేపు ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఎన్నికల జరిగే గ్రామంలోకి రానీయకుండా టిడిపి నేత, మాజీ ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎంఎల్‌ఎ అబ్బయ్య చౌదరి వెళ్లడంతో ఇరుగ్రూపుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది.
పోలైన ఓటింగ్‌శాతం
ఏలూరు జిల్లాలో మొత్తం 10,941 మంది ఓటర్లు ఉండగా శనివారం జరిగిన ఎన్నికల్లో పురుషులు 4392 మంది, మహిళలు 4578 మంది మొత్తం 8,940 మంది మొత్తం 81.71 శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పశ్చిమలో మొత్తం 5,566 మంది ఓటర్లు ఉండగా 4,408 మంది ఓటు వేశారు. ఇందులో 2,100 పురుష ఓటర్లు, 2,308 మంది మహిళా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
సర్పంచి పోరులో వైసిపిదే పైచేయి
పంచాయతీ సర్పంచి ఎన్నికల ఉపపోరులో వైసిపి పైచేయి సాధించింది. సర్పంచి పదవిలో ఉండగా మృతిచెందిన నాయకుని కుటుంబంలోని వారే ఎన్నికల బరిలో దిగారు. దీంతో సానుభూతి కలిసివచ్చిందన్న చర్చ సాగుతోంది. ఏలూరు జిల్లాలో మూడు పంచాయతీల్లో సర్పంచి ఎన్నికలు జరిగాయి. ముదినేపల్లి మండలం వణుదుర్రు గ్రామ సర్పంచిగా పనిచేసిన చిన్నం అర్జున్‌రావు మృతిచెందడంతో అక్కడ ఉపఎన్నిక జరిగింది. ఆయన సోదరుడు చిన్నం సుగుణబాబును వైసిపి సర్పంచి అభ్యర్ధిగా బరిలో దించింది. సానుభూతి పనిచేయడంతో సుగుణబాబు 444 ఓట్ల మెజార్టీతో విజయంసాధించారు. ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం పంచాయతీ సర్పంచిగా పనిచేసిన వేము అబ్రహం మృతిచెందడంతో ఉపఎన్నిక జరిగింది. ఎన్నికల్లో కుమారుడు వేము రాజును వైసిపి బరిలోకి దించింది. సానుభూతి కలిసిరావడంతో వేము రాజు 323 ఓట్లతో సర్పంచిగా గెలిచారు. నువ్వానేనా అన్నట్లు సాగిన పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయతీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి మరడాని లక్ష్మణసోమేశ్వరరావు 286 ఓట్లతో గెలుపొందారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కావలిపురం పంచాయతీకి సంబంధించి సర్పంచి వనచర్ల వెంకటేశ్వరరావు మృతిచెందడంతో ఉపఎన్నిక జరిగింది. ఇక్కడ వెంకటేశ్వరరావు భార్య వైసిపి నుంచి, తమ్ముడు వనచర్ల అప్పనస్వామి టిడిపి నుంచి పోటీపడ్డారు. వదిన, మరిది నడుమ హోరాహోరీగా సాగిన పోరులో టిడిపి బలపరిచిన వనచర్ల అప్పనస్వామి 164 ఓట్లతో గెలుపొందారు. ఏలూరు జిల్లాలో 21, పశ్చిమలో పది వార్డు సభ్యులకు ఎన్నికలు జరగ్గా అత్యధిక స్థానాలను వైసిపినే దక్కించుకుంది.
పంచాయతీ వార్డు స్థానాల్లోనూ వైసిపిదే పైచేయి
పశ్చిమలో పదివార్డులు, ఏలూరు జిల్లాలో 21 వార్డులకు శనివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పశ్చిమలో ఏడు వార్డుల్లో వైసిపి, మూడుచోట్ల టిడిపి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఏలూరు జిల్లాలో 21వార్డుల్లో ఎన్నికలు జరగ్గా పది చోట్ల వైసిపి, పదిస్థానాల్లో టిడిపి, ఒకస్థానంలో జనసేన సానుభూతిపరులు కైవసం చేసుకున్నారు. రెండు జిల్లాల్లో 31 వార్డుల్లో వైపిసి 17 చోట్ల, టిడిపి 13 స్థానాల్లో, జనసేన ఒకస్థానంలో ఆయా పార్టీల సానుభూతిపరులు గెలుపొందారు.