ప్రజాశక్తి - కృష్ణా ప్రతినిధి, విజయవాడ : గ్రామ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల అకాల మరణం, రాజీనామాల కారణంగా శనివారం ఎన్‌టిఆర్, కృష్ణాజిల్లాల్లోని పలు పంచాయతీలకు, వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఫలితాల్లో వైసిపి హవా కనిపించింది. ఎన్‌టిఆర్ జిల్లాలో రెండు సర్పంచ్, మూడు వార్డు పదవులకు జరిగిన ఎన్నికల్లో రెండు సరంచ్‌లను వైసిపి గెలుచుకుంది. మూడు వార్డులో రెండు వైసిపికి దక్కగా, ఒకటి టిడిపి గెలుచుకుంది. ఇప్పటికే ఒక వైసిపి సర్పంచ్ ఏకగ్రీవం అయ్యాంది. అలాగే తొమ్మిది వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవం కాగా, వీరిలో ఆరుగురు వైసిపికి, ముగ్గురు వైసిపికి చెందిన వారు ఉన్నారు.
ఎన్‌టిఆర్ జిల్లాలో రెండు సర్పంచ్, రెండు వార్డుల్లో వైసిపి విజయం
ఒక వార్డులో టిడిపి గెలుపు
వత్సవాయి మండలం పెదమోదుగపల్లి సర్పంచ్‌గా కళ్యాణం విజయలక్ష్మి (వైసిపి), వీరులపాడు మండలం దాచవరం సర్పంచ్‌గా గద్దె వెంకటేశ్వర్లు (వైసిపి) గెలుపొందారు. అలాగే తిరువూరు మండలం ఎర్రమాడు 7వ వార్డు సభ్యుడిగా చలివేంద్రం హరిబాబు (వైసిపి), వీరులపాడు మండలం జమ్మవరం 8వ వార్డు సభ్యుడిగా ఇరుకులపాటి కటాక్షం (వైసిపి), విజయవాడ రూరల్ మండలం నున్న 9వ వార్డు సభ్యుడిగా వల్లూరు వెంకట శివ (టిడిపి) విజయం సాధించారు.
వైసిపి సర్పంచ్ ఏకగ్రీవం
9 వార్డుల్లో ఆరు వైసిపికి, మూడు టిడిపికి
ఎన్టీఆర్ జిల్లాలో 3 గ్రామ పంచాయతీలు, 12 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో జగ్గయ్యపేట మండలం మల్కాపురం సర్పంచ్‌గా అంబోజి పుల్లారావు (వైసిపి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే చందర్లపాడు మండలం పొక్కునూరు 5వ వార్డుకు జెట్టి నాగలక్ష్మి (వైసిపి), జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి 4వ వార్డుకు కందిబండ వసంత (వైసిపి), కంచికచర్ల మండలం కొత్తపేట 7వ వార్డుకు ముప్పాళ్ల గోపిక (వైసిపి), నందిగామ మండలం తొర్రగుడిపాడు 8వ వార్డుకు మోర్ల కల్పన (టిడిపి), పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం 2వ వార్డుకు కొదమల పిచ్చమ్మ (వైసిపి), పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు 6వ వార్డుకు పిడమర్తి తులశమ్మ (టిడిపి), తిరువూరు మండలం వామకుంట్ల 8వ వార్డుకు పున్నం గోపికృష్ణ (టిడిపి), వత్సవాయి మండలం సింగవరం 6వ వార్డుకు చిందు వరలక్ష్మి (వైసిపి), వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు 6వ వార్డుకు అద్దంకి బేబి (వైసిపి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కృష్ణాజిల్లాలో...
కృష్ణాజిల్లాలో ఒక సర్పంచ్, ఎనిమిది వార్డులకు ఎన్నికలు జరిగాయి. పెడన మండలం కొంగంచర్ల సర్పంచ్‌గా లోయ ఊహ (వైసిపి) గెలుపొందారు. చెరో నాలుగు వార్డుల్లో వైసిపి, టిడిపి బలపరచిన అభ్యర్థులు గెలుపొందారు. మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడన నియోజకవర్గంలో కొంగచర్ల సర్పంచ్, బంటుమిల్లి నాలుగో వార్డు స్థానాలను వైసిపి బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్నారు. పెడన మండలం కాకర్లమూడి నాలుగోవార్డు, గూడూరు మండలం పోలవరం 11వ వార్డును టిడిపి గెలుపొందింది. జిల్లాలో మొత్తం రెండు సర్పంచ్, 31 వార్డులకు నోటిఫికేషన్ విడుదల చేయగా, ఒక సర్పంచ్, 28 మంది వార్డు సభ్యుల పదవులు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. పెడన నియోజకవర్గంలో ఒక సర్పంచ్ స్థానానికి, మూడు వార్డులకు ఎన్నికలు జరిగాయి. పెడన మండలం కొంగంచర్ల సర్పంచ్‌గా లోయ ఊహ 22 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 470 ఓట్లకుగాను 436 ఓట్లు పోలయ్యాయి. ఊహకు 225 ఓట్లు, పుట్టి శ్యామల (టిడిపి)కు 211 ఓట్లు వచ్చాయి. ఎనిమిది ఓట్లు చెల్లలేదు. బంటుమిల్లి నాలుగో వార్డుకు గొల్ల సృజన (వైపిపి) 111 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 307 ఓట్లకుగాను సృజనకు 207 ఓట్లు, యాతపూడి మంజుల (టిడిపి)కు 96 ఓట్లు పోలయ్యాయి. నాలుగు ఓట్లు చెల్లలేదు. పెడన మండలం కాకర్లమూడి నాలుగో వార్డులో గుడిసె లక్ష్మీతిరుపతమ్మ (టిడిపి) 55 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 1466 ఓట్లకుగాను 139 పోలయ్యాయి. లక్ష్మీతిరుపతమ్మకు 97 ఓట్లు, గుడిసె రత్నకుమారి (వైసిపి)కి 42 ఓట్లు వచ్చాయి. గూడూరు మండలం పోలవరం 11వ వార్డులో వీరంకి నాగమణి (టిడిపి) సమీప ప్రత్యర్థి (వైసిపి)పై 41 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 182 ఓట్ల పోలవ్వగా నాగమణికి 111ఓట్లు, నాగలక్ష్మికి 70 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లలేదు. కంకిపాడు తొమ్మిదో వార్డులో మొలబంటి దుర్గాప్రసాద్ (వైసిపి) 24 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 727 ఓట్లకుగాను 554 ఓట్లు పోలయ్యాయి. దుర్గాప్రసాద్‌కు 205 ఓట్లు, పేరబత్తిన ప్రవీణ్‌కుమార్ (జనసేన)కు 181 ఓట్లు, చలువాది రాజాగురవయ్య (టిడిపి)కు 159 ఓట్లు పోలయ్యాయి. నోటాకు ఒక ఓటు, చెల్లని ఓట్లు ఎనిమిది పోలయ్యాయి. ఉయ్యూరు మండలం గండిగుంట పదో వార్డులో వీరంకి పాండు రంగారావు (టిడిపి) 31 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 394 ఓట్లకుగాను 271 ఓట్లు పోలయ్యాయి. పాండురంగారావుకు 151 ఓట్లు, మోర్ల యోగేశ్వరరావు (వైసిపి)కి 120 ఓట్లు పోలయ్యాయి. పమిడిముక్కల మండలం అలినకిపాలెం ఆరోవార్డులో షబానా జహా (వైసిపి) హీరే ఫాతిమా (టిడిపి)పై 11 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు నాలుగో వార్డులో వింతా శ్రీనివాసరెడ్డి (వైసిపి) 74 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బాపులపాడు మండలం మల్లవల్లి ఆరో వార్డులో 296 ఓట్లకుగాను 229 ఓట్లు పోలయ్యాయి. పంతం ప్రకాశం (టిడిపి) 53 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.










