Aug 05,2023 08:00

కలెక్టరేట్‌ ముందు పొర్లుదండాలు పెడుతూ నిరసన తెలుపుతున్న పంచాయతీ, స్వచ్ఛభారత్‌ కార్మికులు

         పుట్టపర్తి అర్బన్‌ : సమస్యల పరిష్కారంపై పంచాయతీ, స్వచ్ఛభారత్‌ కార్మికులు పోరుబాట పట్టారు. శుక్రవారం ఉదయం కార్మికులు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌ ముందు నిరసన తెలిపారు. సిఐటియు, పంచాయతీ వర్కర్ల యూనియన్‌ ఆధ్వర్యంలో రహదారిపై పండుకుని నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని.. జీతాలు ఇవ్వకుంటే జైలుకైనా సిద్ధం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌.వెంకటేష్‌, పంచాయతీ వర్కర్ల యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌ మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీలలో మూడు నెలల నుంచి 18 నెలల వరకు వివిధ దశలో వేతనాలు కార్మికులకు ఇవ్వాల్సి ఉందన్నారు. కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వకుంటే వారి కుటుంబాలు ఏమి తిని బతకాలని ప్రశ్నించారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. హైకోర్టు తీర్పు మేరకు తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.21 వేలు, స్వచ్ఛభారత్‌ కార్మికులకు 10 వేలు వేతనం ఇవ్వాలన్నారు. పంచాయతీ కార్మికులను గ్రీన్‌ అంబాసిడర్లుగా గుర్తించి నెలకు 6 వేలు హెల్త్‌ అలవెన్స్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 2132, 680 జీవోలను అమలు చేయాలన్నారు. ప్రమాదంలో మతి చెందిన కార్మిక కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. సాధారణంగా మతి చెందితే 5 లక్షలు ఇవ్వాలని కోరారు. అనంతరం నిరసనకారుల వద్దకు డిఆర్‌ఒ కొండయ్య వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి వినతిపత్రం తీసుకుంటూ ఈనెల 9న కలెక్టర్‌తో మాట్లాడి ఒక సమావేశం ఆరోజు నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికులు వినకుండా, రహదారిపె పొర్లుదండాలు పెట్టారు.
నాయకులు అరెస్ట్‌... ప్రతిఘటించిన మహిళా కార్మికులు..
కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులను ఆందోళన విరమించాలంటూ సిఐ బాలసుబ్రమణ్యం రెడ్డి వారిని కోరారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించమంటూ కార్మికులు సిఐకి స్పష్టం చేశారు. దీంతో పోలీసులు సిఐటియు, పంచాయతీ కార్మికుల యూనియన్‌ నాయకులు ఈఎస్‌.వెంకటేష్‌, రమేష్‌, ప్రవీణ్‌ కుమార్‌, బాబావలితో పాటు పలువురు కార్మికులను బలవంతంగా అరెస్టు చేసి పోలీసు వాహనంలో ఎక్కించారు. అరెస్టులను కార్మికులను ప్రతిఘటించారు. పోలీసు వాహనం కదలడానికి వీలు లేకుండా మహిళ కార్మికులు కారు ముందు బైఠాయించి అడ్డుకున్నారు. అనంతరం సిఐతో పాటు పోలీసులు వారిని అడ్డుతొలగించి నాయకులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో కార్మికులు కలెక్టరేట్‌ నుంచి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ వరకు ర్యాలీ చేపట్టి అక్కడ ఆందోళన చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. అనంతరం పోలీసులు అరెస్టు చేసిన వారిని సొంతపూచీకత్తుపై స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి విడుదల చేశారు. 9న జరిగే సమావేశం అనంతరం సమస్యలు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని యూనియన్‌ నాయకులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ, సిద్దు, కుళ్లాయప్ప, నాగమ్మ, అక్కులప్ప, కదిరప్ప, సజ్జ రామప్ప, భాగ్యమ్మ, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.